మరణం తరువాత
మరణం తరువాత
చేసిన కర్మల తలచి
మరల మరల వగచి
తనకొచ్చిన మరణం
ఇతరుల కంటే అనాయాసమైనదేనా
అని పోల్చి చూసుకుని
మళ్లీ వగచి
అప్పుడే తన వాళ్ళందరూ వెళ్ళిపోయారే
తిరిగి కూడా చూడలేదే అని బాధపడతావో
ఈ తొమ్మిది రంధ్రముల తోలుతిత్తిని అడ్డుపెట్టుకుని
చేసిన కర్మలను నిందించి
ఆత్మ ఎంతటి స్వచ్ఛమో అని ఆలోచించి
నిరాకారుడు నిర్గుణుడు అయిన ఈశ్వరుని గూర్చి
వెతికి వెతికి అలసేను
గర్వము లేదు
మనిషి అధికుడన్న గడుసుతనమూ లేదు
అదో చిత్రమైన స్థితి
ఇదేనా మరణం
ఏమీ లేనితనం
అన్నీ ఉన్న ప్రపంచంలో
తానొక్కడే లేనన్న నిజం
ఇదేనా జ్ఞానం
అంతా కల అయితే
మెళకువలు నేర్చుకుని మెలకువలో ఉండడం మంచిదా
లేదా కలగా అనుభవించడం మంచిదా
ఆత్మకు నవ్వు వచ్చింది
మంచి చెడులు ఎందుకని
మరో శరీరం వెతుక్కునే పనిలో పడింది
