మరమ్మత్తులు
మరమ్మత్తులు
మస్తిష్కాన్ని కాస్త మరమ్మత్తులు చేసుకుంటూ
అడుగులు వేసే సమయం వచ్చింది
ఒక యుగం సేద తీరిన తర్వాత రాద్దాం అంటే
అలసట వచ్చి ఆశలు నీరవుతున్నాయి..
తత్వం బోధపడక తప్పులు దొర్లుతున్నాయి
ఎక్కుపెట్టిన శరం గురి తప్పుతూ
సంఘపు సమరరంగములో నిలువలేక
ఆలోచనలు మారిపోతూ నడుస్తున్నాయి.
ప్రయాస పడుతున్న బ్రతుకు తెరువు
క్రొత్త ఆవిష్కరణలకు మిగిలింది పాతదారి
నిత్యం పరుగులు పెట్టే జీవిత వేటలో
మార్గపు అన్వేషణలో అస్తిత్వం కనిపిస్తుంది.
శిఖరాగ్రానికి ఎక్కాలని యవ్వనపు కోరిక
నిరూపించేందుకు నిత్య సంఘర్షణల ప్రయాణం
నిషా రాత్రి విరబూసిన నక్షత్రం జారుతూ ఉంది
సూర్యోదయానికి ఆశ అటకెక్కి కూర్చుంది..
మనసుపై నిప్పులను పోసుకుంటూ కదిలితే
కత్తుల రాపిడిలో గాయాలే మిగిలే
ఎన్నుకున్న గమ్యం ఎడారిలా తోస్తుంటే
వసంతాల వనం ఎక్కడ దొరుకుతుంది మనిషికి..
విశ్రాంతి లేకుండా కలం కాగితం ముడి పడుతుంటే
పరిశోధనల ప్రపంచంలో ఒక వస్తువుగా నిలిచుంటే
అక్షరాల పట్టుకొమ్మ పైన కూర్చొని
ప్రతి చర్యలో ను పువ్వులు పూయాలంటే జరగదు..
