మనిషి
మనిషి
ఎదుటోడి వినాశనం, విలాపం వినోదమైన లోకంలో
సామాజిక మాధ్యమాల్లో సామరస్యాన్ని ప్రచారం చేస్తూ,
సామాజిక బాధ్యత, మనిషన్న మాట మరిచి
దానవుడై, మనసుల్ని దహించేస్తుంటే
దగాపడ్డ జీవితాలు దిగాలు పాలౌతుంటే...
ఎదుటోడి కష్టాన్ని ఎదకత్తుకుని మోమున నవ్వై మొలిచి
నీకై నేనున్నాననే మనసున్న మనిషి కావాలి?
అంతస్తుల్లో, అంతరిక్షంలో అడుగులేసే మనిషికి
బడుగుల బురదమయమైన జీవితాల్తో పనేముంది?
సమభావం , సామాజిక వికాసం కనుమరుగై
సామాజిక బాధ్యతలేక, సమన్యాయం పొందలేక
కుటిలత్వం, కౄరత్వం, కుళ్ళిన భావజాలం
దేహాన్ని జాడ్యమై పీడిస్తూ, పీల్చేస్తుంటే...
మానవత్వమే మునిగి ఆర్తనాదమే చేస్తుంటే...
వరదల్లో సామాన్యుని శరీరం శవమై తేలుతుంటే...
సంస్కారం చచ్చిన మనిషి, అంతిమ సంస్కారం చేయలేక
ఆరడుగుల నేలకై అన్వేషణలో పడ్డాడు!
తన చివరియాత్ర ఇలా కాకూడదాంటూ...
కలతపడుతూ, కన్నీరౌతూ, కళ్ళుతెరిచి
మనోనేత్రంతో మరోప్రపంచాన్ని చూస్తూ...
మనసులోని మృగాన్ని చంపి, మానవత్వమే నింపి
నా ప్రేమను పంచాలంటూ మీకోసమే బయలు దేరాడు?
వారి చిరునామాకై కష్టమూ, కన్నీరున్నచోట అన్నార్తులనడగండి!
చేతనైతే మీరూ చేయూతనిచ్చి ప్రోత్సహించండి.
మానవత్వం నిండిన మనసే మనిషికాభరణం...
మంచితనం పొంగిన మాటే మనసుకు స్వాంతనం...
ధనానికి దానం, గుణానికి సాయం, పరులపై ధ్యానం
ఉన్నపుడే జగతిన అవి ద్విగుణీకృతం!
నిన్ను నీవే ప్రేమించుకుంటే స్వార్థం, అది వ్యర్థం...
నీ చుట్టూవున్న ప్రాణుల్ని ప్రేమిస్తే, అందం, అమితానందం..
