మంచు పూలతో
మంచు పూలతో
హిమం సుమమై శ్వేతపుష్పాల తుషారం
హిమాలయాలే మంచుదుప్పటి విలాసం
అంటార్కిటికా తెల్లగొంగడేసుకునే కాలం
మంచులోయలు భూతాపానికి ఆకాశగంగలా
శివుని కొప్పులోంచి జలధారలు కురుస్తుంటే
తన్నుతాను సవరించుకునే అమర్నాథుడు
శ్వేత కపోతాల ఆరాధ్యదైవమైన జగతికి
శిఖరాలయం
మందాకినీ సలిలత స్వచ్చమైన స్పటికం
విశ్వనాథుడి డమరుక ధ్వనిలో ధ్యానం
విశ్వమంతా బ్రహ్మీ ముహూర్తాన ఓంకారం
తపస్విలే శశిరేఖలై ఓంశాంతి జపమాల
అవని చల్లని స్పర్శ రూప రస గంధం
యాసంగి పంటల మేనియపై మంచుపూలు
రైతే చలిచెలిని కొప్పేసుకుని నాగలి సేద్యం
ఊటబావి వేడినీటిలో ఉషారాణి కురుల సిరి
నీరు ఉసిరికలా పారిజాతమై పారే గంగను
ప్రగతి మాలధారణలో తన్నోడి నీటినే
కలుషితం చేశాడా?
నీరే కాలుష్య కోరల్లో చిక్కుకుని తప్పించుకోలేకపోతుందా?!!!
ఈ శతాబ్ది వెన్నెల లబ్దిలో వెలుగులెవరికీ?
చుక్కలై దిక్కులేక ఊపిరికి గాలి ఆడని
అస్థిరత అస్థిపంజరాలకు ఎవరిదీ బాధ్యత?
చావుకు పొగపెట్టే నల్లమబ్బులను హరించే
నీలకంఠులేరీ?!!!
ఈ భువి చక్కని సౌభాగ్య గౌరీకుండం
కాలుష్య వేటును కట్టడి చేస్తేనే
ఏ కాలమైనా మనిషికి కానుకయేది
లాభాపేక్ష కాసుల త్రాసులోంచి
ప్రేమగా దిగుతేనే వ్యాపారం నిజాయితీ
కండువా కప్పుకునేది!

