మిత్రమా... ఇది ఒక రైలు ప్రయాణం
మిత్రమా... ఇది ఒక రైలు ప్రయాణం


ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగాం
ఒక్కటై ఇక్కడ ఉండేవాళ్ళం
కొన్ని రోజులు కొన్ని గంటలు
అయినా ప్రయాణంలో స్నేహితులం
ఈ రైలు ప్రయాణంలో బేధాలు లేవు
బంధుత్వాలే కేవలం ఆత్మ బంధత్వమే
కష్ట సుఖాలు కలబోసుకున్నాం
కులం మతం ప్రాంతం భాష అడ్డురాలేదు
ఒకరికి కష్టమొస్తే ఆదుకునేవాళ్ళం
ఇంకొకరికి ఇష్టమైన మాటలే ఆడుకున్నాం
ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపాం
అయినా తెలుసు విడిపోక తప్పదని
కోపాలు తాపాలు ఉండి వుంటాయి
ఈర్ష్యా ద్వేషాలూ ఉంటాయి ఏమో ....
కష్టమొస్తే మేం ఉన్నామని అనుకున్నాం
దిగ వలసిన స్టేషన్ వస్తే బాధగా ఉంటుంది
కలిసి ఉన్నది రోజులే... గంటలే అయినా
తెలియని అభిమానం అనుబంధం
అంతలోనే ఆత్మీయులమై కలిసిపోయాం
విడిపోవల్సి వస్తుందని తెలుసు అయినా
కలసి కలకాలం ఉండిపోవాలనిపిస్తుంది
చేరవలసి స్టేషన్ గుర్తుకు రాగానే....
అయ్యో...ఈ ఆత్మీయులు ఇక రారా...
విడిపోయి వీడ్కోలు చెప్పవలసిందేనా..
టీ భోజనాలు పలహారాలు పంచుకున్నాం
తెలుసు మనం ఒకరికి ఒకరు ఏమీకాము
క్షణకాలం మిత్రులు దిగిపోగానే....
మనసు బాధతో రోధిస్తుంది బాధేస్తుంది
అదో కుటుంబం అదే లోకం అనిపిస్తుంది
అక్కడే ఉండిపోతే బాగు అనిపిస్తుంది
కుదరదు రైలు ఆగదు కదా కదలవల్సిందే
విడిపోయినప్పుడు కళ్ళలో కన్నీటి పొర
అందరికీ తెలుసు ఈ ప్ర
యాణాలింతే
అయినా మనసు సున్నతం స్నేహాశీలి
కలిసి ఉన్న మిత్రలు వదిలి పోతుంటే
దిగులు అన్నీ కోల్పోతున్న ఆవేదన...
కలసి ఉన్ననాడు ఇంట్లో కష్టాలు...
ఒంట్లో కష్టాలు గుర్తుకు రావు అదే వింత
వ్యక్తిగత ఈతిబాధలు తలుపుకి రావు
ప్రయాణ మిత్రులు ఉంటే గుండె తేలిక
విడిపోక తప్పదు మిత్రమా ఆది నిశ్చయం
వీడ్కోలు తప్పదు ఆప్తులారా అయినా
చెయ్యి వదిలేస్తే మనసు చివుక్కు మని
హృదయాలు రోధిస్తాయి మౌనంగా
ఇది రైలు ప్రయాణం మనం విడిపోవాలి
కలసి ఉన్నప్పుడు కలుపుగోలుగా ఉన్నాం
హృదయాలు స్వచ్చంగా ఉంచుకన్నాం
ఎలాగూ విడిపోక తప్పదు ఇది రైల్ జర్నీ
క్షేమంగా ప్రయాణం చెయ్యాలి మిత్రమా
తప్పులుంటే మన్నించాలి ఒప్పులుంటే
పాటించి గుర్తుకు తెచ్చుకుంటుండాలి
మరవకు మమ్మల్నిమర్చిపోకు మిత్రమా
అవకాశం ఉంటే మరోసారి కలుద్దాం
కుదిరితే ఇలాగే మరో రైలులో వెళ్దాం
అంతవరకూ సెలవు మిత్రమా వెళ్ళిరా
మర్చిపోకు ఇది కేవలం రైల్ జర్నీ...
""అయినా మర్చిపోలేని అనుభూతి""
మర్చిపోకు..మరువలేని జ్ఞాపకమా...
తోటి ఉద్యోగిని పదోన్నతి పొంది బదిలీపై
వెళ్తున్నప్పుడు ఘన వీడ్కోలు చెబుతూ
.