మేలికొలుపు
మేలికొలుపు


కోడి కూసిందీ లే మిత్రమా లెమ్ము
ప్రొద్దెక్కక మునుపే ఆ చల్లని వేళలో సాగిపోవాలి
గుడి ద్వారపు గంటల గణగణలు వినిపిస్తున్నాయి
ఆ చెట్టు కొమ్మపై అపుడే పక్షి రెక్కలిప్పుకుంటుంది
పహారా పోలీసు కూడాను ఇప్పుడే వెను తిరిగాడు
లే మిత్రమా లెమ్ము...
తెల్లవారుతుంది లే మిత్రమా లెమ్ము
కళ్ళు నులమను కాళ్ళు మడిచే సమయమే కాదు
పాల వాహనాలు సైతం వచ్చి పంచి పోతున్నాయి
ఆ కోయిల సరాగపు కుహుకుహలేమి వినపడలేదా
రంగవల్లి ముంగిలి సిద్దంచేసే ముత్తైదువను చూడు
లే మిత్రమా లెమ్ము...
తెమ్మెరొస్తుంది లే మిత్రమా లెమ్ము
సంక్రాంతి హరిదాసు సరి చేస్తున్న తంబూరా విను
ఆకులు మీద చేరిన మంచు తుంపరనూ పరికించు
ఆకాశ గర్భాన్ని చీల్చే ఆ కావి బింబాన్ని పరీక్షించు
అవనికి వెలుగులు పంచే ఆ ప్రక్రియనంతా వీక్షించు
లే మిత్రమా ఇక లెమ్ము...
వెలుగులిచ్చాయి లే మిత్రమా లెమ్ము
చేరవలసిన దూరం చేరుకోను ఆ సరి తరుణమిదే
నిన్నటి ఊహల్ని రాత్రి కలల్ని ఇక్కడే వదిలేయాలి
కొత్త తీరం చేరి కోటి కోరికల బావుటాను ఎగరేయి
తెల్లవారెనే మిత్రమా మరి తెలుసుకొన వచ్చేసెయి
లే మిత్రమా ఇక లెమ్ము...
తొలి సంధ్యలోనే తొలి ప్రయాణము మొదలిడు
తొలకరి కోరికలు తోరణాలుగా గుచ్చి కదలాడు