మధ్య తరగతిలో నేటి మహిళ
మధ్య తరగతిలో నేటి మహిళ


కోటి ఆశలు...తీరని కోర్కెలు
ఉన్నదాంట్లోనే ఉన్నతంగా వుండాలని
వచ్చినదానితోనే సరిపెట్టుకోవాలని
తెచ్చిన వారు తక్కువ
రాబడి వచ్చేమార్గాలు పరిమితం
నచ్చిన వస్తువు కొనలేక
మెచ్చిన బట్టలు కట్టుకోలేక
నలుగురిలో పలుచన అవ్వలేక
గొప్పగా ఉండలేక
లేమితనం చూపించుకోలేక
ఇరుగుపొరుగు ఆరాలులో
ఇంటిగుట్టు రట్టు కాకుండా....
ఎన్ని గుప్త రహస్యాలో
ఎంత మానసిక సంఘర్షణలో
మిడిల్ క్లాస్ మహాభారత వ్యధలు
ధరలకు రెక్కలు వచ్చి
ఎగిరి గెంతులు వేస్తుంటే...
నిండుకున్న వెచ్చాలు పెదవి విరుపులు
వంటింటి బడ్జెట్ రోజువారీ సమీక్షలు
హోమ్ కం ఫైనాన్స్ మంత్రి పేరొకటి
ఉన్ననాడు ఒక్క సినిమా...
మరో షికారు చిన్న కుటుంబ సంబరం
ఎప్పుడోగాని కుదరని యాత్రలు
యాంత్రిక లోబడ్జెట్ జీవితంలో
అరిటాకే వెండి కంచం..బంగారు పళ్లెం
కార్పోరేట్ కిడ్స్ ప్రపంచంలోకి
పిల్లలు పోటీకి వెళ్తామని అడుగుతారు
వాళ్లకు బడ్జెట్ బలహీనతలు చెప్పలేక
బల నిరూపణ చూపలేక
లెక్కలేనంత మనో ఉక్కిరిబిక్కిరి
నగలు..నట్రలు దండిగా లేవు
ఉండాలనే పట్టింపులూ లేవు
తాళి బొట్టుతో కాస్తా "సంపద"
ఉంటే...మహా వేడుక
పెదవిపై చిరునవ్వే వజ్ర వైఢూర్యం
అల్లంత దూరంలో ఏడు అంతస్తుల మేడ
కోరికలు కోటలు దాటుతున్నాయి
కాసులు మాత్రం గొర్రెతోక బెత్తెడే...
దీర్ఘ నిట్టూర్పు... సుదీర్ఘ ఆలోచన
బీటలు వారినా చిట్టికొంపే....మహల్
చిరుజీతంసామ్రాజ్య షాజహాన్
వాయిల్ చీర ముంతాజ్ కోసం
తాజ్ మహల్ కాదు వహ్ తాజ్ 'టీ'
త్రాగించినా చాలు సెన్సాఫ్ హుమర్ లో
ముంచి తేలించినా చాలు ప్రేమతో
చిట్టి చిట్టి నిత్యావసరాలను
వాయిదా వెయ్యలేక
వాయిదా పద్దతిలో కొనుగోలు చేస్
తే
వస్తువులు ఎప్పుడో అరిగిపోయాయి
షాప్ వాడు బాకీలు తీరనేలేదు
ఇంటియాజమాని యమదర్జాగా...
బైక్ తీసి వీధిలో 'మైకు' పెంచుతాడు
నవ్వాలో...ఏడవాలో తెలీదు
బియ్యం డబ్బాలో డబడబలే...అయినా
ఆయన డాంబికమే ఆలికి అదో సరదా
పుట్టింటి నుండి పట్టు చీరలు రావు
మెట్టినింటిలో ఆ ఊహలే లేవు
రాజీ పడటమే తెలిసిన ఇల్లాలికి
అమ్మోరుకి చూపిన కాటన్ చీరే
ఉప్పాడ పట్టు ఇరుగుపొరుగు చెవిలో
భూతకాలం కొరతల కొలిమి
వర్తమానం అరకొర బలిమి
భవిష్యత్ ఆశల పల్లకీ
పిల్లలు బాగుంటే అదే పది కోట్లు
వారసులే కంటికి మనసుకి వెలుగులు
పట్టణమంతా తిరిగి తిరిగితే...
ప్రతి ప్రకటనా పలుకరిస్తుంది
ముందుకెళితే నుయ్యి
వెనుక నున్న ఆర్ధిక గొయ్యి తలపించి
కళ్ళలో మెరుపుతో...కొనేయడమే
ఉద్యోగిని అయితే ఉరుకులు పరుగులు
ఇంటిలో అబల వీధిలో సబల
ఆదివారం అయితే శతవధానం
సహస్ర హస్తభూషిత గృహిణి
నీలకంఠిని....అంతలోనే ఆనందలహరి
తాళి కట్టించుకుంది మొదలు
పాడె ఎక్కినవరకూ త్యాగమే...
ముందునున్నవి మంచి రోజులన్న శ్వాసే
నేల టికెట్ లో కూర్చోలేక
బాల్కాని ఖర్చు తట్టుకోలేక 'బెంచీ'...
మధ్యతరగతి మహిళ విజయ నాయికే
మగడు మృగమైతే.... ఇంకా నరకం
అతగాడు మిత్రుడైతే...ఇంకెందుకు స్వర్గం
ఇల్లే ఆనంద వేదిక పడతికి కానుక
కష్టమైనా ఇష్టమే... పెనిమిటి, పిల్లలు
వంట బాగుంది అంటే చాలు ఆమె
"నిండు కలువ"