మైదానం
మైదానం
నిర్జన మైదానంలో నన్ను దుర్జన రాజకీయమేదో బంధించింది పలుపుత్రాడుతో గుంజకు ఓ పసరంలా ! చుట్టూ లోతైన ఆంక్షల కందకం ఎన్నాళ్లీ ఏకాంతంలో విరహ గీతాలు పాడుకోను ? అంగాంగాలను స్పృశిస్తూ ఊహాలోకంలో వోలలాడను ? శోకాలతో కేకలేస్తున్న సమాజాన్ని చూస్తూ? చూస్తూనే వున్నాను... క్షుదాగ్నిజ్వాలాకీలల్లో ఆహుతౌతున్న శలభాలను.. చూస్తూనే వున్నాను.... ఆపన్నులు లేని నా భారతంలో పన్నుల భారంతో నేల కరుస్తున్న సామాన్యులను చూస్తూనే వున్నాను.... చేడియల చెంపలపై జారుతున్న కన్నీరు వంటగదుల్లో వూపిరి తిత్తుల చిల్లులు చూస్తూనే వున్నాను.... కాంతికి నోచని ఆమూల వీధిల్లో మంచాల కిర్రు కిర్రు శబ్దాలనూ అమ్ముకున్న దేహాల మూల్గులనూ.. కడుపు శాంతించినా కన్నీటికి శాంతి లేని పడుపులనూ చూస్తూనే వున్నాను.... పబ్బుల్లో డ్రగ్గులు మ్రింగి నేలపై పొర్లుతున్న యువత నగ్న దేహాలను అందు స్త్రీ ఎవరో పురుషుడెవరో ఎవరికెరుక? సనాతనధర్మ జపమాచరించే పాలకులు కంటికి గంతలు కట్టుకున్నారు ! చూస్తూనే వున్నాను.... జిగుప్సాభయానక భీతితో ఆ ముళ్లపొదల చాటున కన్నతల్లులకు పనిలేని కసికందులను! కళ్ళు పొడుస్తున్న కాకులనూ.... ఇంకా గట్టిపడని ఎముకలను నములుతున్న నక్కలనూ....... చూస్తూనే వున్నాను.... అవినీతి భేతాళుడిని భుజంపై మోస్తున్న అక్రమ విక్రమార్కులను... చూస్తూనే వున్నాను... తలకొక తాటిరేఖనిచ్చి మతంకల్లు పోస్తున్న రాజకీయాన్ని ! చూస్తూనే వున్నాను.... కుల ప్రాకారాలను దూకి ఒకటైన ప్రేమికుల కుత్తుకలను గొడ్డళ్లతో నరికి పరువు రక్తాన్ని త్రాగి బ్రేవ్ మని త్రేపుతున్న పెద్దలను ! చూస్తూనే వున్నాను.... నా దేశంలో ఋతుసంహారాన్ని వసంతంపై వ్రేలాడుతున్న ఖడ్గమాలలను శిశిరంలోనే నిలిచిన కాలాన్ని ! కాగితమొకటి ఇవ్వండిరా! సలసల కాగుతున్న నా రక్తంతో ఓ కవితనైనా వ్రాసుకుంటాను.!
