కొత్తిల్లు పాతిల్లు
కొత్తిల్లు పాతిల్లు
ప్రతి తరానికి మదిలో మెదిలే ఇళ్ళు
తాను బతికిన ఓ పాతిల్లు, ఓ కొత్తిల్లు
దాదాపుగా పుట్టి పెరిగేది పాతింట్లో
స్వార్జితంతో తదనంతరం ఉండేది కొత్తింట్లో
ఇల్లు, తరాలుగా చూస్తున్న తంతు ఇది
మనిషి మనుగడకు మకాంల వరుస అది
మారే కాలం కొద్దీ పాతొక రోత, కొత్తొక వింత
పాత, కొత్తలు పదిలంగా స్మృతులు నీ చెంత
పాతిల్లు ఉమ్మడి కుటుంబాల గూడు
కొత్తింట్లో ఒంటరి బతుకుల వెతల గోడు
పాతింట్లో పెనవేసుకున్న అనుభూతులు
కొత్తింట్లో వెలిసిపోయిన అనుబంధాలు
ఆధునిక శైలిలో కొత్తిల్లు వున్నా కొంత వెలితి
పాత దానిలో వసతుల వెలితున్నా కలిమి
హంగులు, ఆర్భాటాలు కాదు కదా ఇల్లంటే
ఉమ్మడిగా ఉషారుగా ఉన్నతంగా బతుకంటే
పాతింట్లో ఏర్పాట్లు ఏ వర్గీకరణ లేని సన్నిధి
విశాలమైన, విస్తారమైన ఆలోచనల పెన్నిధి
మనుషులుగా విడిపోని సమైక్యతల రాగం
మనసులు మమేకమైన మమతల కోవెల
కొత్తింట్లో ఎవరి గదులు వారికే స్వంతం
అడ్డుగోడలతో అంతరంగాల పంతం
ఎవరికి వారే, యమునా తీరే వారి నైజం
ఆర్థిక బంధాలతో పెనవేసుకున్నది నిజం
పాతిల్లు ప్రేమ, ఆప్యాయతల చిరుజల్లు
విలువల ప్రోదితో పంచుకున్న పొదరిల్లు
కొత్తిల్లులో మసకబారిన మానవ సంబంధాలు
ఏ ఇల్లైనా కష్టసుఖాలు పంచుకుంటే చెల్లు !
