నీ కోసం గాక
నీ కోసం గాక
నీకోసం గాక ఏమి..పాడలేను వ్రాయలేను..!
తలనిమిరే నీ చేయిని..చూడలేను చూపలేను..!
నా లోపలి నీవేమో..వేషాలకు అతీతమే..
మదివేదన కాల్చకనే..నిలువలేను పంచలేను..!
ఈ మాటల గారడితో..మాయచేయు పనేముంది..
ఎవ్వరినో మార్చాలని..తలచలేను కోరలేను..!
అందరు నా ప్రతినిధులే..చక్కని ప్రతిబింబాలే..
ఈ సినిమా నాదేలే..మరువలేను మరగలేను..!
మట్టిచాటు రంగులన్ని..వెలికితీయు గాలిలీల..
ధారలయే వెలుగుతేనె..దాచలేను ఆపలేను..!
అర్థంపర్థం లేనిది..కాదీ బ్రతుకని తెలిసెను..
జన్మగుట్టు పట్టుకోగ..చెప్పలేను నేర్పలేను..!
