అచ్చులూ హల్లులు
అచ్చులూ హల్లులు
#అచ్చులూ హల్లులు#
కొన్ని జీవితాలు మనలో సంగమిస్తాయి
మనం కొన్ని జీవితాల్లో ప్రవహిస్తాం
ఇదే సమాజమంటే!
దోషాలెన్నున్నా...మనుషుల్ని వద్దనలేం
ఆశా నైరాశ్యాల మధ్య మునిగి తేలేది
వారిలోనే కదా!
కష్టాలు ప్రవాహంలో కొట్టుకుపోవు!
వీచే గాలికి ఆవేదనలు చెదిరిపోవు!
మనుషుల విషాదంతో మేఘాలకేం పని!
దేహానిది 'ప్రకృతి' తత్త్వమేయైనా
భారానికి జారిపోయే ఇసుకలాగా
మన హృదయ ఉద్వేగాన్ని
అది ఎప్పటికీ మోయదు!
మన కోసం ప్రతిస్పందించడం తెలీదు!
మనసు బరువును మోయడం కేవలం
మరో మనసుకే సాధ్యం!
కన్నీటి చుక్కైనా
చెలియకట్ట దాటే ఆనందమైనా
ఇంకో హృదయానికి ప్రవహించాల్సిందే!
ఝంఝా మారుతంలా మదిలో గూడు కట్టిన కారుమబ్బుల్ని చెదరగొట్టేది సాటి మనిషే!విషాదాలంటే ఏవో...
సహాయాలంటే ఏమిటో...
తెలిసినవారు... తీర్చగలిగే వారు
మన చుట్టూ మనుషులే!
మనుషులుగా ఓ జాతి తీగకు
పుట్టి రాలిపోయే వాళ్ళం!
మరి...మన చివరి యాత్ర బరువునూ
మోసేది చుట్టూ ఉన్న మనుషులే కదా!
అందుకే...సరిపోనివి ఎన్నున్నా
మనసుకు సరి పోలిక మరో మనసే!
మనిషి తోడు మరో మనిషికే!
సమాజంలో చీలికలెన్నున్నా
మరమ్మత్తు కూడా మనిషే!
అందుకే సహ జనుడు క్షమార్హుడు!
ప్రేమాస్పదుడు!
జీవన సోయగాన్ని నిర్వచించగలిగే
భాష మనిషికే తెలుసు!
లోక భాషలెన్నున్నా
మనుషుల మధ్య లిపి ఒక్కటే!
ఆ దస్తూరికి
అనుబంధాలు...స్నేహాలు
అచ్చులూ హల్లులు!
