సముద్రం
సముద్రం
రోజుల భారాన్ని మోస్తున్న మనిషి
సందెపొద్దు కాడ సాగర తీరాన్ని చేరతాడు,
కన్న కలల సాకారానికై ఆ అలల సవ్వడి
ఏదైనా ఉపదేశం ఇస్తుందేమోనని-
పట్టా చేత బట్టినా పట్టెడన్నం కరువైన తాను
మాసిన గెడ్డంతో సార తీరాన చతికలబడతాడు
సముద్రుడితో తన గోడును మొర పెట్టుకోవడానికి
తెగిన చెప్పుకు పిన్ను పెట్టుకుని,
చిరిగిన షర్టులో సిగ్గును దాచుకుని,
ఊరూరా తిరిగిన బాటసారి అలిసిన దేహంతో
రేపటి ఆశల చిగురింతలకై కొత్త ప్రణాళికలందు
కేంద్రీకరించడానికై ఇసుక తెన్నెలపై చేరతాడు
ఓ సగటు తండ్రి
ప్రియురాలి కోపం, ప్రియుడి తాపం చల్లారాలంటే
ఇలా వచ్చి అలా జోరున మేనును తాకే చల్లని గాలులు
అడగకనే పులకరింపజేసే వర్షపు జల్లులు సముద్ర
తీరంలోనే సాధ్యం
తన చెంత చేరిన ఎందరినో సముద్ర తీరం
అందంగా అలరిస్తుంది అక్షయపాత్రలా,
ఒడ్డున ఉన్న మనిషి భవసాగరాన్ని ఈదలేక
సతమతమయ్యే వేళ కాసేపు ఉవ్వెత్తున
లేచే అలలతో కాసేపు ఊసులాడిన వేళ,
దొరకపోదు సమస్యకు ఓ పరిష్కారం
అవును,సముద్రం మానవ చరిత్రలో ఎన్నో
కధలు నింపుకున్న భాండాగారం,
ఆ సాగర ఘోషలో గడిపిన క్షణాలలో
మదిలో స్వాంతనేకాదు,అమృతంలాంటి
ఓ ఆలోచన తప్పక మెరుపులా మెరవక పోదు
