జీవన తరంగాలు
జీవన తరంగాలు
అంతేలేని ఈ అనంత కాల గమనంలో
మనిషి జీవితం అనే మహా సముద్రంలో
మన జీవితం ఒక చిన్న పడవ మాత్రమే
సుడిగుండాలు దాటుతూ సాగే పయనమే
సంద్రంలో గాలులు మారినా, అలలు ఎగిసినా
ఆటుపోటులు అల్లకల్లోలంగా అటుఇటైనా
ఈ పడవ ప్రయాణం మాత్రం అసలే ఆగదు
దరిచేరే ప్రయత్నంలో కన్నీళ్ళు సముద్రం పాలు
ఈ ఆధునిక నగరాల నియాన్ వెలుగుల్లో
కలలకు కొత్త రంగులు పూస్తూ, మెరుస్తూ
మొబైల్ తెరల్లో బంధమైన మన మనసులు
నిశ్శబ్దంగా ఒంటరితనంలో ఈదుతున్నాయి
వేగంగా పరుగెత్తే జాతీయ రహదారులపై
మన ఆశలు కార్లలా వేగంగా దూసుకెళ్తాయి
కానీ మమ హృదయాంతర లోతుల్లో మాత్రం
ఒక ప్రశ్న నిశ్శబ్దంగా - ఇదేనా మన జీవితం
అలల్లా వస్తాయి విజయాలు ఎపుడోసారి
అలల్లా అల్లాడిపోతాయి అపజయాలు ఓసారి
కానీ సముద్రం పోటు ఎప్పుడూ తగ్గిపోదు
అలాగే మనిషి ఆశ, నిరాశల అలలు కూడా
ఒక అల విరిగితే మరో అల పుడుతుంది
కెరటాల్లా ఉత్తాన్న పతనాలు ఎగిసి, ఎగిసి
పడినా, లేచినా చర్విత చరణంగా మామూలే
అదే ఈ జీవన తరంగాల జీవన రహస్యం
పడిపోవడం, మళ్లీ ముందుకు సాగడమే
ప్రయాణం ముగిసే దాకా పరితపించడమే
మొదలైన పయనం తుదకు గమ్యం చేరడమే
నడి సంద్రంలో మునగాల్సి వస్తే అంతర్థానమే
అందుకే ఈ జీవితం సంద్రపు అలల ఆటలాగే
కొన్నిసార్లు తుపానులా, ఉప్పెనలా, సునామిలా
కొన్నిసార్లు ప్రశాంతంగా, నిశ్శబ్ద తరంగంలా
చిట్ట చివరికి ప్రతి తరంగం చెప్పే మాట ఒక్కటే
ప్రయాణం కొనసాగాలి, జీవితం సాగాలి
ఈ జీవన తరంగాలలో, ఈ చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతమైనా, అలాగే కాకున్నా
ఈ జీవన తరంగాల తంతు, ఓ కసరత్తు !!
