కొండ అద్దమందు ...(కవిత)
కొండ అద్దమందు ...(కవిత)


మొదటిసారి చూసినప్పుడు
వాడొక కొత్త అద్దంలా భ్రమింపచేస్తాడు.
ముచ్చటపడి పదపదే మన ప్రతిబింబాన్ని
చూసుకుని మురిసిపోతాం...
చూసుకుంటున్న
మన సహజరూపం
వాడి అద్దపు గొప్పతనంగా
ఉన్నతీకరించుకుంటాం,
మనం మనలా ఉండగానే
అద్దం వెనుక పూత రాల్చుకుంటూ
వాడు వెళ్ళిపోతాడు.
ఎలాచూసుకున్నా మన బింబం
పగలని ముక్కలుగా కనిపిస్తూ
మసకబారిపోతుంది.
మనసుతో ముఖం కడుక్కున్నాకా
తెలిసే సత్యం...
వాడు మిధ్యా ప్రతిబింబమని.
రాలుపూతలు మార్చడం వాడికి
వెన్నతోపెట్టిన విద్య అని.
అయినా బుద్ధిరాని మందబుద్ధి
మరో అద్దాన్ని ఆశ్రయిస్తుంది.
సహజత్వాన్ని కోల్పోయిన మనిషికి
కృత్రిమం అద్దంలో కొండలా కనిపించడంలో
వింత ఏముంది?
*******