ఖాళీగా
ఖాళీగా
ఏ పని నువు చేస్తున్నా..ఉన్నావా ఖాళీగా..!?
ప్రశ్నించే నీ మనసును..చూశావా ఖాళీగా..!?
కళలు ఎన్ని నీకున్నా..ఒకటి మటుకు కూడదోయి..
అహంకారమను దానిని..చేశావా ఖాళీగా..!?
తినేవేళ ఒక్కముద్ద..పక్కన పెట్టలేదు సరె..
'సెల్ఫోన్ టీవీ'లు లేక..తిన్నావా ఖాళీగా..!?
మాటలెన్నొ నేర్చినావు..పాండిత్యం మంచిదేలె..
నీ లోపలి మౌనంతో..ఉన్నావా ఖాళీగా..!?
లెక్కలు భలె వేస్తావోయ్..డబ్బుతోనె జీవితమా..
ఆశ లేవి లేకుండా..అయ్యావా ఖాళీగా..!?

