కాలము రాసుకునే కావ్వాన్ని
కాలము రాసుకునే కావ్వాన్ని
గమ్యములేని గమనములో
నా జాడలు వెతుకుతున్నాను
ఎడారి నేలలో నడుచుకుంటూ
సుఖాల ఒయాసిస్ కోసం చూస్తున్నాను..
ఆనందం లేని జీవితములో
చీకట్లో వెలుగును ఆస్వాదిస్తూ
నవ్వులేని బ్రతుకులో
ఎండిన చెట్టుకు నీళ్లు పోస్తున్నాను..
నన్ను నేను తలుచుకుంటూ
మనసులో శాంతి మంత్రాన్ని జపిస్తూ
మహా సముద్రంలో నిప్పులా
మౌనంగా మునిగి తేలుతున్నాను..
కనిపించని శూన్యపు జీవితంలో
కన్నీటి రెప్పల్లో ఊరుతున్న జలం
అనంత బాధను వ్యక్తం చేసింది
తేలికపడి మనసును సేద తీరుస్తుంది..
ఒంటరిగా పోతాననుకుంటే
నా ఆశలో శ్వాసలో అక్షరం రగిలింది
సచ్చుబడిన దేహానికి దీపమై
అనంత లోకములు స్థానం కల్పించింది..
ఇప్పుడు కోటానుకోట్ల జనం
నా చుట్టూ మూగి పోయారు
నా కలలకు రెక్కలు తొడుగుతూ
నాలో స్థైర్యాన్ని ధైర్యాన్ని నింపారు..
నేనొక అనాధను కాదు ఇప్పుడు
ఒక సజీవ గీతాన్ని
ప్రపంచపు వృక్షములో అమృత ఫలాన్ని
కాలము రాసుకునే కావ్యాన్ని….
