ఈ క్షణమే నీది
ఈ క్షణమే నీది
** ఈ క్షణమే నీది **
ఆగదు నీకోసం కాలం
అడుగులు వెయ్యలేవు కాలపు అడుగులలో
పరుగులు తీయలేవు కాలంతో
కళ్లెము వెయ్యనూ లేవు కాలపు మూతికి
మెడలో ధరించనూ లేవు కంఠాభరణంలా
కాలం కొలత ప్రాతిపదిక క్షణం
ఈ క్షణం నీది
మరుక్షణం ఏమో!
మన జీవిత గీత అతి పొట్టి
మరీ మరగుజ్జయి
మరణించనూ వచ్చు
అర్ధాంతరంగా...
అన్నీ తెలుసు నీకు
నీకు తెలియనిదే మాయ!
నీదే అయిన క్షణాన్ని నిర్లక్షించి
నీదో కాదో తెలియని క్షణం కోసం
ఆరాటాలూ పోరాటాలూ!
దోచుకోడాలూ దాచుకోడాలూ!!
నీ తర తరాలకోసం దాపరికం
నీవు తినవు లేనివానికి పెట్టవు
కాటి వరకు తోడైనా రాని నీ దారకోసం
నీ బూడిదను ఏ గంగలోనో కలుపుటకైనా తీరిక చేసుకొనలేని నీ పుత్రుల కోసం...
మరు క్షణం నిన్ను మరచి
నీ దాపరిక సొమ్ము కొరకై కుక్కల్లా
కాట్లాడుకునే నీ కొడుకుల కోసం
నీ సుఖాన్ని ఖర్చు చేస్తావ్
కాదా ఇది మాయ!
నీదైన ఈ క్షణాన్ని ఎలా గడపాలో
క్షణం ఆలోచించు
నీ మనసు కాన్వాసుపై చిత్రించు నీ ప్రణాళిక
ఆస్వాదించు ఆనందాన్ని
స్వాగతించు సుఖాన్ని
పంచు నీ ప్రేమను నీ వారికి
చిందించు చిరునవ్వులు
నవ్వించు నీ వారిని
నీ చెమటను లక్ష్మీగా మార్చావే
ఆనందంగా నీవే అనుభవించు
జీవితంలో జీవించు
అందుకో అన్ని సుఖాలనూ
అలాగని అల్లరి చిల్లరిగా కాదు సుమా!
సాంప్రదాయము విధించిన పరిధిలో
లక్ష్మణుడు గీచిన గీత దాటకుండాను
సుఖపడు
సుఖాన్ని పంచు
గుర్తుంచుకో
ఈ క్షణమే నీది!
