ఈ క్షణమే చివరిదైతే
ఈ క్షణమే చివరిదైతే
గతం తలుపు తీసి
వర్తమానంతో కరచాలనం చేస్తాను
కమ్మేసిన విషపు ఆలోచనచట్రం నుండి
దూకేస్తాను.
సాయం చేసిన చేతులకు
నమస్కరించి
ఆదరించిన మనసులకు శిరస్సు వంచుతాను
సేవలతో ఆదరించిన ఆత్మీయులకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను.
ఆందోళన ను ఆమడ దూరం విసిరేసి
నచ్చిన గీతాలు ఆలపిస్తూ
మెచ్చినవారితో మాటలు కలుపుతాను
చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపంతో
క్షమాపణలు నివేదించుకొని
సుఖ నిద్రకు సిద్ధమవుతాను
రేపనేది ఇక ఊహకు అందదని.
