గెలిచిన కోల్పోయిన జీవితం
గెలిచిన కోల్పోయిన జీవితం
"నిన్నటి రేయి తర్వాత
ఎటో వెళ్ళిపోయిన నక్షత్రాలు
నేడు కనిపించాయి"
ఇది మనిషికున్న
అమాయకపు బాల్యపు వర్ణం
నేడు దిగంతాలకు
వ్యాపించిన జ్ఞానం ముందు
బాల్యమనే వర్ణం వెలిసిపోయింది!
కలగాపులగమైన ఆశల వర్ణాలను
రెక్కలకు పూసుకున్న
స్వచ్ఛమైన ముడిమనసు
రంగులను ఆరబెట్టుకునేందుకు
ఆరాటాల ఆకాశం వైపు చూస్తోంది!
గ్రహాలను దాటేసిన మానవ విజ్ఞానం
సంతోషమెక్కడో వెతికి తెలుసుకోలేక
భాష తెలియని పుస్తకాన్ని
చదివే పాఠకుడల్లే సతమతమౌతుంది!
మనిషికి గెలుపెంత ముఖ్యమైనా...
పణంగా ఒడ్డేది సంతోషాన్నయితే...
బ్రతుకనేది ఓ జూదమే కదా!
గెలిచినా కోల్పోయేది జీవితం కదా!

