ఎవరు తాను
ఎవరు తాను
ఎవరు తను?
కేవలం రక్తమాంసాల బొమ్మ కాదు..
అంతుచిక్కని మౌన సముద్రం లోతుల్లో దాగున్న ఒక నిశబ్ద విస్ఫోటనం!
పుట్టినప్పుడు తండ్రి నవ్వు కోసం తన ఇష్టాలను వదిలేసింది,
పెరిగాక అన్నదమ్ముల పౌరుషం కోసం తన స్వేచ్ఛను తాకట్టు పెట్టింది,
పెళ్లయ్యాక పరాయి ఇంటి దీపమవ్వడానికి.. తన అస్తిత్వపు వేళ్లనే కోసేసుకుంది.
ప్రతి రోజూ తెల్లవారుజామునే నిద్రలేస్తుంది.. కానీ తన కోసం కాదు,
తమ అనుకునే వారి ఆకలి తీర్చడం కోసం.
వంటగది పొగలో తన యవ్వనాన్ని కరిగించేస్తుంది,
అంట్లు తోమే క్రమంలో తన కలల మెరుపును పోగొట్టుకుంటుంది.
ఆమె చేతి వేళ్ల మధ్య నలిగిపోయేది కేవలం పిండి ముద్దలు మాత్రమే కాదు..
అవన్నీ ఆమె ఎన్నడూ చెప్పుకోలేని, తీరని చిన్ననాటి కోరికలు!
ఎవరూ అడగరు.. "నీకు ఏం కావాలి?" అని,
ఎందుకంటే ఆమె "అన్నీ ఇస్తుందని" అందరికీ తెలుసు.
తన కడుపు ఆకలిని చిరునవ్వుతో దాచి,
వడ్డించేటప్పుడు "నేను తిన్నానులే" అని అబద్ధం చెప్పే ఒక గొప్ప నటి తను.
అలసటతో ఒళ్లు హూనమైనా,
బిడ్డ చిన్న ఏడుపు వినబడితే చాలు.. నిద్రను తరిమేసి ప్రాణాన్ని అడ్డువేసే ధైర్యం తను.
లోకం ఆమెను 'అబల' అంది.. కానీ,
తొమ్మిది నెలలు మృత్యువుతో పోరాడి జీవాన్ని ఇచ్చేటప్పుడు ఆమె చూపిన బలం ఎవరికుంది?
అవమానాలను భరిస్తూ, ఆంక్షల మధ్య బతుకుతూ..
ఇంటి గౌరవాన్ని కాపాడటానికి తన ఆత్మగౌరవాన్ని చంపుకునే ఓర్పు ఎవరికుంది?
స్త్రీ అంటే కేవలం ఒక పేరు కాదు, ఒక బాధ్యత కాదు..
అది ఒక నిరంతర త్యాగ యజ్ఞం!
ఆమె కళ్లలో కన్నీళ్లు ఉండవు.. అవి గడ్డకట్టి నల్లపూసలయ్యాయి,
ఆమె గుండెలో గాయాలు ఉండవు.. అవి రాటుదేలి ఇంటికి పునాది రాళ్లయ్యాయి.
మహిళా దినోత్సవం అంటే ఒక రోజు ఇచ్చే పువ్వు కాదు,
ఆమె కళ్లలోని నిశబ్దాన్ని అర్థం చేసుకునే ఒక 'చూపు'.
ఆమె చేతికి ఇచ్చే గౌరవం కాదు,
ఆమె మనసుకి ఇచ్చే 'విలువ'.
తను లేకపోతే సృష్టి లేదు,
తను లేకపోతే ప్రేమకు అర్థం లేదు,
చివరికి.. తను లేకపోతే నువ్వు లేవు, నేను లేను.
ఆమె మౌనం విస్ఫోటనం చెందకముందే..
ఆమెలోని మనిషిని గుర్తించు, ఆమె త్యాగాన్ని ప్రేమించు!
