ఏకాంతమో
ఏకాంతమో
గోధూళి తో పడమటి ఆకాశం సంధ్యారాగం అలపిస్తోంది
పక్షుల కిలకిలా రావాలతో చెట్లు సందడి చేస్తున్నాయి
చీకట్లు అవనిని మెల్లగా ముసిరేవేళా
సంధ్యా దీపాలు వెలిగించి అర్చనచేసే వేళ
మది గడప లో హృది తచ్చాడుతోంది
గుండెలయలు మాటి మాటికి
నీ కోసం పలవరిస్తూ పాడుతున్నయి
ఏమిటోనబ్భా ఈతలపులకు పనే లేదు
నిన్ను క్షణం క్షణం గుర్తు చేసుకునే యావనే
మది గది నిండా నువ్వు నీ జతలో నేను
నీ మధురభావాల మధురానుభూతుల ఊయలలో
ఊగి పోతున్న ఈ సమయం ఎంత మధురమో
కానీ ఎదురుగా నువ్వు లేని నిజం
నన్ను లేని లేమిలోకి నెట్టేసింది
అయినా నువ్వెప్పుడు ఇంతే
ఉన్నట్టుండి కెరటంలా చుట్టేస్తావు
కళ్ళు మూసి తెరిచే లోపు అలలా జారిపోతావు
నిన్ను పట్టుకున్నానులే అని అనుకుంటానా
కానీ నువ్వేమో దాగుడు
మూతల దండాకోర్ వవుతావు
ఏమిటో నువ్వు మనసులో ఉండి
ఎదురుగాలేని ఈ ద్వైధీ భావన నాలో
"ఇది ఏకాంతమో , ఒంటరి తనమోతెలియని వేళ"
నన్నిలా నీ తలపుల కాంతను చేసేసావు కదా

