తొలి ప్రేమ
తొలి ప్రేమ


ప్రేమతో నా కాదు..? బాధతో నా కాదు? ... ఈ రెండింటిలో ఏదో తెలియని వేదనతో రాస్తున్న లేఖ.. దీనిని ప్రేమలేఖ అనాలో లేక మరువలేని మధురమైన జ్ఞాపకాల గుర్తులు అనాలో అర్థం కావడం లేదు..
కన్నా.... ఉదయించే సూర్యునీలా నా జీవితంలోకి వచ్చి నా జీవితానికి వెలుగు రేఖలను పరిచయం చేసి , ఏ స్పందన లేని నా హృదయాన్ని కంపించేలా చేసి, మూగబోయిన నా హృదయానికి మాటలు నేర్పించి.. అంతలోనే అస్తమించే సూర్యునిలా సాగరపు అంచున కనుమరుగయ్యవు .. ఆగని నదులుగా మరె, నీకై నా ఆలోచనలు నీలో సగమవ్వాలని , సంద్రంలో ఎగసిపడే అలలా నిన్నే గమ్యంగా చేసుకొని ఎదురీదుతున్నా... నా మనసును అదుపు చేసే ప్రయత్నంలో నేను ఓడుతూ, నిన్ను గెలిపిస్తూ, నాకు నేనుగా నీకు బానిసవుతున్నా..
పోనీ నువ్వు ఒక కళ అని మరిచి పోదాం అనుకుంటే , నీ జ్ఞాపకాల గురుతులు కనిపిస్తూనే ఉన్నాయి.. అవి చెరిప్పేద్దాం అని ఎంత ప్రయత్నించినా చెరగనంటున్నాయి ..
కన్నా ....నీకు గుర్తుందా నువ్వు ఎప్పుడూ అడిగే వాడివి.. నేనంటే ఎంత ఇష్టం నీకు అని..?
ఇప్పుడు చెప్పనా, నువ్వు నా జీవితంలోకి ఇంత ఆలస్యంగా వస్తావని ముందే తెలిసుంటే, ఈ లోకంలో నీతో పాటు ముందుగానే పుట్టే దాన్ని , ఎందుకంటే నిన్ను ఇన్ని సంవత్సరాలు ఎందుకు మిస్ అయ్యాను అని చాలాసార్లు అనుకున్నాను కాబట్టి .. అంత ఇష్టం నువ్వంటే.. ఇష్టానికె అసూయ పుట్టేంత ఇష్టం నువ్వంటే...!
నా ఎద చదివిన మొదటి అనుభవం నీ ప్రేమ, నా కనుపాపలు చూసిన మొదటి కావ్యం నీ రూపం, నీ పరిచయంలో నేను రాసే ప్రతి అక్షరం కనే ప్రతీకల ని జ్ఞాపకం.. నా మొదటి తలపు ...నా చివరి అక్షరం నీకోసమే..
కన్నా... నిన్ను మరవాలని నా మనసును శిలను చేస్తే.. ఆ శిల కాస్త శిల్పమై నీ రూపం ధరించి నీ ప్రతిబింబమై నా యదలో భారమై, కల ఓర్వలేని తియ్యటి బాధై నన్ను వేధిస్తుంటే నిన్ను ఎలా మరువను....
నా కనురెప్పలు వాలనంటున్నవి, కన్నుల తడి ఆరనంటున్నది, నీ రూపు కోసం నా కనుపాప ఎదురుచూస్తోంది.. వ్యసనమైన నీ జ్ఞాపకాల వలలో కొట్టుమిట్టాడుతున్నాను.. నాతో చెప్పిన ఊసులు చేసిన బాసలు మరిచావా..
కన్నా నువ్వు నన్ను వదిలి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పావు ఇప్పటికీ గుర్తుంది.. ఏంటో చెప్పనా.. బంగారం నేను మీ నాన్న తో మాట్లాడాను, తను ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం ,లేదు ఒప్పుకోవడం లేదు కాబట్టి నీకు నాతో వచ్చే ధైర్యం తెగింపు ఉంటే.. వచ్చేయ్, వచ్చే ముందు ఇంకో విషయం కూడా చెప్తున్నాను బాగా ఆలోచించుకో... నువ్వు వచ్చాక మీ వాళ్ళని వదిలేసి వచ్చా అని బాధపడకూడదు... నువ్వు అలా బాధ పడిన ఆ క్షణం నేను లేనట్టే.. ఏడుస్తావా నా ముందు ఎడువు , బాధపడతావా నా ముందు బాధపడు , నాతో పోట్లాడు, అల్లరి చెయ్, నాతో గెలువు ,ఓడిపో, కానీ మీ వాళ్ళని మిస్ అయ్యా అనే మాట మాత్రం నా దగ్గర మాట్లాడకు, అని అన్నావు.. నువ్వు అలా అన్నప్పుడు కన్నయ్య ఏంటి ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడు అనిపించింది.. కానీ నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది నువ్వు ఎందుకు అలా అన్నావొ.. అది ప్రేమ అని నీకు నాపై ఉన్న ప్రేమ అని...
నడిరేయిలో నిశిది ఛాయలు అలముకున్న వేళ ఒంటరైన నా పలుకులు, నీ తోడు లేక అడుగులు వెయ్యానంటున్న నా పాదాలు, నాలో నువ్వు లేవని శ్వాసను తీసుకోనంటున్న నా హృదయం, అన్ని కలగలిపి నన్ను నరకంలోకి నెడుతుంటే.. నింగి నుండి జాలువారే వర్షపు చినుకులతో నా కన్నీరు జత కడుతుంటే, నలువైపుల నన్నల్లుకున్న నిశిది తో , నేను స్నేహం చేస్తున్నా..
కన్నా.... ఈ అక్షరాలు అన్నింటిని ఎలా రాశానో తెలుసా..?
నా కన్నీటిని కలంలో పోసి, నాలోని బాధని భాషగా చేసి, నా మనసులోని భావాలను మాటలుగా మలచి, నాలోని ప్రేమను ,బాధను, వేదనను ,నీకు తెలపాలనె ఆతృతతో రాసిన లేఖ ఇది.. పదిలంగా ని గుండె గుడిలో దాచుకుంటావొ, వద్దని సుదూర తీరాలకు విసిరేస్తావొ నీకే వదిలేస్తున్నా...