దిష్టి
దిష్టి


లోకమంతా నాకు సోకమైపాయెరో
లోకులంతా నేడు కాకులై పాయెరో
పుష్టిగున్నా నాకు దిష్టి పెట్టిండ్రు
ముష్టి ఎత్తే స్థితికి తీసుకొచ్చిండ్రు !!
ఊరు పెట్టిన ఉసురు ఊరికే పోతదా
ఇంతలోనే నాకు అంత బాదోస్తాడా
బాగుపడ్డంక నేను బాధ పడుతున్నాను
కుళ్ళు లోకము కళ్ళు మూయలేకున్నాను
ఓర్వలేని తనము నేర్వలేకున్నాను
మంచితనమే నాకు సర్వమనుకున్నాను !!
మనిషి చూపుకు కూడా ఇంత శక్తుంటదా
కొంప ముంచేటంత వింత యుక్తుం టదా
పక్క వారి చెడుకు దైవ భక్తుంటదా
పాడు లోకము నుండి నాకు ముక్తుంటదా !!
నమ్మకాలతోని నిమ్మకాయలు బెట్టి
గుమ్మం ముందు ఇంట గుమ్మడికాయ గొట్టి
చేతబడి చేసి పసుపు కుంకుమ గొట్టి
నా దుంప తెంపిండ్రు నా కొంప ముంచిండ్రు !!