దేవరకొండ
దేవరకొండ
నిజం సెప్తాండానప్పా
మా అనంతపురానికి
నిలువు నామం తీర్చినట్లుంటాదప్పా
మా దేవరకొండ ....
అటు బుక్కరాయ సముద్రాన్ని
ఇటు అనంతపురాన్నీ
తూకం వేస్తున్న తక్కెడ ముల్లులా
ఉంటాదప్పా మా దేవరకొండ ....
కొండముందు భాగంలో
అనంతపురం చెరువు
బుక్కరాయసముద్రం చెరువులమధ్య
మధ్య మంధరగిరిలా వుంటుందప్పా
మా దెవరకొండ ....
పున్నమి రోజుల్లో
చెరువులో నీళ్ళున్నప్పుడు
తనప్రతిబింబాన్ని
తనే సూసుకొని మురిసిపోతాంటాదప్పా
మా దేవరకొండ ....
సుట్టుపక్కల
ఏ వైపునుంచీసూసినా
ఫదిమైళ్ళ దూరానికే కనపడుతూ
అందరినీ పలకరించినట్లుంటుదప్పా
మా దేవర కొండ ....
బస్సుల్లో కూకొని వచ్చేవాళ్ళకు
దేవరకొండ కనపడగానే
అనంతపురం వచ్చేసిందప్పా అని
ఏమి సంతోషపడేవారోనప్పా
మా దేవరకొండను చూసి ....
వెన్నెల రోజుల్లో
పైన ఆకాశంలో చంద్రుడు గుడికడితే
కింద చెరువు మీదినుండీ కొండను చూస్తే
వెన్నెల గోపురంలా వుంటుందప్పా
మా దేవరకొండ ....
భూమిపైనుంచీ
సుమారు రెండువేల అడుగుల ఎత్తులో
పాము మెలికలు తిరిగినట్లుండే మెట్లతో
పైకి పోతూంటే
కింద ఎర్రటినేలలు,పొలాల గెణుపులు
ప్రకృతిని ఫోటోగ్రాఫరు
క్రేన్ షాట్ తీస్తున్నట్లుంటుదప్పా
మా దేవరకొండ ....
ఎక్కేకొద్దీ అయాసము
ఎక్కినంతమేరా ఉల్లాసము..
అలసిపోయి ఎక్కడ కూకోవాలనిపిస్తే
అక్కడో పెద్దగుండు సూపి కూకోమంటుందప్పా
మా దేవరకొండ ....
కొండెక్కినాక సూడాలి
మా కొండలరాయని గుడి
గుడిలోపల గుహలో కొలువైవున్న కొండమీదరాయుడిని
కొలిచేవారికి కొంగుబంగారవయి
వెలసిన తిరుమలరాయడిని ....
పైన కొండమీదరాయని గుడిచుట్టూ
గుండ్లమీద బండలమీద
ఎటుచుసినా తోకరాయుళ్ళే
మాకేమి తెచ్చారంటు నిక్కి నిక్కి సూత్తాంటాయి ...
కొండకింద బుక్కరాయసముద్రంలో
ఊరు పుట్టుదలలో కట్టిన
వెంకటేశ్వరసామి గుడి
ఆ ఊరికె ఒక ప్రత్యెక ఆకర్షణ ...
ప్రతి మాఘమాసంలోను
బుక్కరాయసముద్రంలో తేరు జరుగుతుంది
అనంతపురానికీ సుట్టుపక్కల పల్లెలకు
బుక్కరాయసముద్రం తేరంటే
ఎక్కడలేని ఉత్సాహం ....
పున్నమినాడు కొండమీదరాయడిని
పురాతనమయిన పెద్ద తేరులో
బంతిపూలతోరణాలు,లిల్లీపూల హారాలు
టెంకాయపట్టలతో అందంగా అలంకరించి
పెద్ద పెద్ద మోకులతో జనం తేరును లాగుతూంటే
ఇసకేస్తే రాలని జనంతో
కళకళలాడుతూ సామీ ఊగుతూ వీధుల్లో వస్తూంటే
చూసిన వాళ్ళదే ఆనందం ....
అదేమో జిల్లాలో వచ్చె తేర్లన్నీ
పరసలన్నీ, జాతర్లన్నీ
మంచి ఎండాకాలమే వస్తాయి
బుక్కరాయసముద్రం తేరుతో మొదలయి
వరుసగా పప్పూరు అశ్వత్థం
యాడికి చెన్నకేశవ స్వామి తేరు
బొలికొండ రంగనాయకుల తేరు
తడకలేరు పరస
పెన్నోబులేశుని తేరు
ఉరవకొంఠ గవిమఠంసామి తేరు
కదిరి నరసింహుని తేరు
ఆఖరున ధర్మవరం చెన్నకేశవుని తేరుతో
ఆ సంవత్సరానికి తేర్లు ముగుస్తాయి ..
నాకు పాయమొచ్చినాక
ప్రతి సంవత్సరం జతగాళ్ళతో
బుక్కరాయసముద్రం తేరుకు పోవల్సిందే
బొరుగులు,బెండు బత్తాసులు
చెరుకు గడలు ఇంటికి త్యావల్సిందే ....
తేరుకు పోతూ, వస్తూ
ఎన్ని హాస్యాలు, ఎన్ని జోకులు
ఎన్ని సినిమా పాటలు పాడుకొంటుండే వాళ్ళం
ఎన్నెల్లో చెరువు కట్టమీద వస్తాంటే
ఆయ్యో అప్పుడే అయిపోయిందా తేరు
అనుకొంటూ తేరుముచ్చట్లు చెప్పుకొంటూ వచ్చెవాళ్ళం
అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ
దేవరకొండ అనంతపురానికి అండ
ఆ కొండమీదరాయని సేతికింద
అనంతపురం సల్లగుండ .....
