దాంపత్యం అద్భుతః
దాంపత్యం అద్భుతః
తాళి కట్టే వేళ
అతని మునివేళ్ళ పలకరింపులు
క్రీగంట చూసిన
ఆమె కాటుక కన్నులు
రెప్ప వేయనివ్వని అందాలు
ఆలింగనాలూ అనుభూతులూ
తొలి రేయి తరువాత
తప్పని గిల్లికజ్జాలు
అట్లు
తిట్లు
ఆఫీసు విషయాల చీవాట్లు
పిల్లల కోసం వేసే ఒట్లు
కప్పు కాఫీ చేసే బెట్లు
సెలవలు
పట్టని బట్టల బీరువాలు
చేతిలో చేయి వేసి నడిచిన పార్కులు
మధ్య వయసులో వేదాంతాలు
పక్కింటి బాగోతాలు
ఇంటింటి రామాయణాలు
పలకరించే మాత్రలు
వృద్ధాప్యపు ముడతలు
ఎర్రగా పండిన నోరు
తాంబూలానికి థాంక్స్ చెబుతుందా
జీవితాన్ని కలిసి పండించుకుంటూ
ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకోకుండానే
ఒకరి చేతిలో ఒకరు కనుమూయాలని
ఒకరి కంటే ఒకరు ముందే వెళ్లిపోవాలని
చివరకు వారే వారి ప్రపంచం
వారిరువురూ ఒక ప్రపంచం
కష్ట సుఖాల్లో స్నేహితులై
ఆజీవ స్నేహానికి ప్రమాణమైన
ఆ జంట ఎక్కడో
అలాంటి దాంపత్యం అద్భుతః
అని అనగలిగి
అందులోని మాధుర్యాన్ని
గుర్తించగలిగేది ఎందరు
