చూడలేను
చూడలేను
వంచిన తల ఎత్తలేను..కనులలోకి చూడలేను..!
ప్రేమించిన సంగతినే..పెదవివిప్పి పలుకలేను..!
ఈ అల్లరి కురులసాక్షి..తేనెవాగు రొద ఏమో..
కొంగులాగు గాలిదెంత..కొంటెతనమొ తెలుపలేను..!
విరహవీణ సవరించే..చేయేదో కనిపించదె..
చైత్రరాగ మాలపించు..కోకిలనే చూపలేను..!
పరాభవ'ము తప్పదులే..లేనిపోని గొప్పలకిక..
భవరోగం మాన్పుమందు..గ్రోలకనే ఉండలేను..!
విందుచేయు వసంతాన్ని..నిలిపివేయు చదువేదో..
నేర్చుకునే ముచ్చటలో..ఉండుటనే మరువలేను..!
ప్రాణసఖుని పూజా సుమమై..మిగిలినదీ మనసే..
లోకానికి బొమ్మగీసి..చూపాలని తలచలేను..
