STORYMIRROR

Kalyani B S N K

Drama

4  

Kalyani B S N K

Drama

చిటికెనవేలు చివరన

చిటికెనవేలు చివరన

1 min
287

 వెలుతురు తెలియని లోకం నుంచి..

 చిక్కని నల్లటి చీకటి నుంచి..

 రక్తం నిండిన కుహరం నుంచి..

ఓర్పు, క్షమ లకు వెల్లువ నుంచి..,


వెనుకటి జన్మల  వెతలను మోస్తూ..

రేపటి కాలపు ఊహలు చేస్తూ..


ఒక్కసారిగా


మరో ప్రపంచపు మెలకువలోకి

చీకటి వెలుగుల చిత్రం చూస్తూ..

చిరిగిన సంచిని మరింత చీల్చుకుని

మరో జన్మకై నా మహా ప్రయాణం..


ఇదిగో ....ఇలా..


మూసుకున్న కనురెప్పల మాటున..

ఇంతకు ముుందటి ఆ ఆత్రం దాటిన

 నును వెచ్చని ఊపిరి సెగల చాటున ..

ఎత్తు పల్లాల ఏకాకి బాటన...


అమ్మ పొత్తిళ్ల ఊయలలూగుతూ..

నా పిడికిలి తెరిచిన మనిషిని చూస్తూ..

అమృత భాండపు చనుమొన చీకుతూ

అందలమెక్కిన భావన చేస్తూ...


కన్నుల ముందటి కల్లోలంలో

సన్నని నవ్వుల చిరు వెల్లువలో..

ఏది సొంతమో ఏది పరతంత్రమో

ఏమీ తెలియని ఏకాకితనం లో..


అమ్మ పురిటి మంచాన నేను ఇలా ఉండగా..


ఒక జత కళ్ళు నన్నే తాకుతూ

నాన్న...నాన్న అని వత్తి పలుకుతూ..

మూసిన గుప్పిట మరి మరి తెరుస్తూ

తన గుబురు మీసాలు నా బుగ్గన గుచ్చుతూ..

నాన్న ..


నాకేం తెలుసు..

ఈ నా ఉనికికి తానే అసలు సురని..

నా రేపటి వేకువ వెలుతురు తానని..

ఎల్లలెరుగని నా భవిత కోసం ..

రెప్పల మాటున ..

ఎప్పటిి నుంచో కలలను కంటూ ..

నిర్నిద్ర దీర్ఘ రాత్రులను 

ఆశాదీప్తుల పరిష్వమ్గం లో

అలవోకగా అమ్మను చూస్తూ..

అమ్మ బొజ్జలో నా కేరింతలు వింటూ

 ఆనందించే....

ఉల్లాసపు ఒక వెల్లువని!!!


అందుకే ..

దోబూచులాడుతూ.. అమ్మకొంగులో 

అటు తిరిగి దాక్కొని ..

చూ ..అంటూ ఇటు తిరిగానో లేదో..

నాన్న కళ్ళ లో వేయి పున్నమల వెలుగులు..

 మానాన్న మోము లో ..

 మెరిసే నవ్వుల తారకలు..



ఇక 

ఆ చిటికెన వేలి చివరనే 

నా రేపటి భవితకు పునాది..

ఆ తెలియని భావాల కలబోతే 

నా నీడగా నడిచే ఉగాది.





Rate this content
Log in

Similar telugu poem from Drama