చిన్ని చిన్ని ఆనందాలు
చిన్ని చిన్ని ఆనందాలు
చిన్ని చిన్ని ఆనందాలు
గుండె గూటిలో చెరగని ముద్ర వేస్తాయి-
వానలో తడిసి ముద్దవటం
మండుటెండల్లో మిట్టమధ్యాహ్నం
చీమచింతకాయలకై తాతయ్య
కళ్ళు కప్పి పారిపోవడం,
తోటలో స్నేహితులతో జేరి జామకాయాలు
దొంగిలించడం, అమ్మ ఊరికెళితే తన చీరను
చుట్టుకుని పెద్ద ఆరిందలా నడవడం,
పెరటిలోని మొక్కలపై బెత్తం పట్టుకుని
టీచర్ లా పెత్తనం చెలాయించడం;
మగపిల్లలతో జేరి గోళీలు ఆడటం
ఆడపిల్లలతో చింతగింజలాడడం
పొలానికి వెళ్ళి ముంజేలు తెచ్చి
తెగ సంబర పడిపోవడం,
మామిడి కాయాలు గడ్డివాములో
దాచి గంటకోసారి చూసి మురిసిపోవడం,
తోకలేని పిట్టలా ఊరంతా తిరగటం
గోదారిలో ఈతలు కొట్టడం
చెట్టులు పుట్టలతో సహా
అన్నీ ఆట స్థలాలే -
బాల్యం అదొక అందమైన రంగస్థలం
మరల మరలా ఆ పాత్ర పోషించలేని
బతుకు చిత్రం
జీవిత పయానానికి అర్థం మారింది,
వైరాగ్య నీడలలో కొందరు
ఆధ్యాత్మిక ధోరణిలో మరికొందరు
నిత్య ఆనందాల జోరులో ఇంకొందరూ
డబ్బు సంపాదనే అనే జబ్బు
గొడుగు కింద చాలామంది-
ఆలా తలా ఒక దారి ఎంచుకున్నా
జీవితం చరమాంకానికి చేరినాక
గుండె గూడు తెరిస్తే చాలు
నెమరేసుకునే జ్ఞాపకాలెన్నో!
కళ్ళముందే కనిపించే వైచిత్రాలెన్నో!
ఒక్కసారిగా పెదాలపై నవ్వు
కళ్ళల్లో నీళ్ళూ వచ్చేస్తాయి,
ఈ చిన్ని చిన్ని ఆనందాలు ఏవీ
కాసులతోనో కరెన్సీలతోనో
కొనే పనిలేదు,అయినా జీ
విత పయనమంతా గాలించినా
మరెక్కడా కానరావు ఎందుకనో!
