వెళ్ళి పోతుంది రా
వెళ్ళి పోతుంది రా
వెళ్ళిపోతుందిరా ఓ గొప్పతరంం
మంచితనంవెలుగు దారులు చూపిన ఆ తరం
గుండెను గుడిగా మార్చిన మంచి చిత్రం
కష్టాలను నమ్మి కడుపును నింపి
కన్నీటిలో నవ్విన పాతతరం
అన్నం ముద్ద పెట్టే ముందర అడిగేది పక్కింటి ఆకలిరా
అరుగు మీద కూర్చొని అందరితో ఆప్యాయంగా పలికే పలుకురా
'నేను' అని కాదు 'మనమంటూ' నడిచిన బంగారు బాటరా
బంధాల కోసమే బ్రతికిన వాళ్ళు ఆత్మ బంధువులురా
లాంతరు వెలుగులో చదివి పెరిగి లోకానికి దారులు చూపెరా
బావి నీళ్లతో బలగమై బ్రతికి బండేడు పనులు చేసెరా
మైళ్ళ దూరాలు నడిచే కాళ్ళు మట్టివాసన మోసేరా
చెమటోడ్చి పిల్లల భవిష్యత్తును చిరునవ్వుగా మార్చేరా
బుర్ర కథ వినగానే మురిసిపోయి తోలుబొమ్మలాట చూసేరా
అరచేతిలో ఫోను లేకున్నా ఆత్మీయతలు పంచరా
పోస్టుకార్డులో ప్రేమను నింపి పలకరింపులు పంపేరా
పల్లె అరుగుల మీద అంతా పాత కథలు చెప్పేరా
ఆస్తులకంటే అనుబంధమే అమూల్యమని నేర్పిరా
ఉమ్మడి కుటుంబ నీడలోన ఉత్సాహంగా జీవించేరా
కష్టమొచ్చినా కుంగిపోకుండా కదలి ముందుకు సాగేరా
త్యాగాల పునాదుల మీదనే తరాల భవిష్యత్తునుంచేరా
ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఒక యుగాన్నే తీసుకెళ్తున్నారు
మిగిలిన జ్ఞాపకాలలో మానవత్వం నాటుతున్నారు
ఆ తరం చెప్పిన మంచి మాటలు మన హృదయంలో దాచుకుందాం
మన పిల్లలకు ఆ విలువలను మంచి వారసత్వంగా అందిద్దాం
వెలుగు దారులు చూపిన తరం
వారిచ్చిన విలువల పరం పరా వాడిపోనియ్యదు ఈ తరం..!!!
