చెప్పలేనిది
చెప్పలేనిది
చెప్పలేనిది చూపలేనిది..ఆశతెచ్చే మరణయాతన..!
చెలియచూడదు దరికిచేరదు..కలనులేదే తీపిసాంత్వన..!
మొదలునరికిన చెట్టుకూడా..చిగురువేసెను చూడబోతే..
గొంతుపెగలని పాటలాగే..గొప్పబహుమతి విరహవేదన..!
మల్లెతీగకు కోకిలమ్మకు..పెళ్లికుదిరెను యేటిఒడ్డున..
మధువనాలకు రసమునింపే..దివ్యరాగమె ప్రేమసీమన..!
మాటలాడే మౌనరాధిక..ఎదనుమీటే చల్లగాలియె..
గోరువెచ్చని శ్వాసతానై..నిలిపె మనసును చెలిమితోటన..!
పూలభాషలు ఒలుకుకనులే..మరపుమంత్రం ఆలపిస్తే..
హృదయమేమో నీదుపూజా..సుమముకాగా నిత్యసాధన..!
మీటచిక్కని సరసవీణకు..తంత్రులేవో చూడనైతినె..
చెలునిసన్నిధి చేరుదాకా..ఆపలేనీ వెర్రిశోధన..!

