బతుకు బతుకమ్మా
బతుకు బతుకమ్మా
ఎండా వానల మధ్య సాక్షాత్కారం ఇంద్రధనుస్సులు
మురిపిస్తాయి, మైమరిపిస్తాయి, మనసులు చూరగొంటాయి
అవి ప్రకృతి సృష్టించే ప్రసాదాలు
ముల్లోకాలలో ప్రకృతి పరవశించేది పూలతోనే
పూల గొప్పతనం గుర్తించింది తెలంగాణ తల్లులే
ఏడాదికోసారి పూలసింగిడిలు ఆడుతాయి బతుకమ్మలు
అందగత్తెలు కాకున్నా కలిసి విరజిమ్ముతాయి అందాలు
పూలను పూజించే ఆచారం తెలంగాణకు మణిహారం
గడ్డి, గునుగుల్లాంటివి పనికిరానివనుకుంటాం
దున్నేసి భూమిలో కలిపేస్తాం
అలాంటివెన్నో అవతారమెత్తుతాయి అమ్మవారిలా
తంగేడు, బంతి, చేమంతి, కట్ల ఎన్నెన్నో
కొలువు తీరుతాయి ప్రజల గుండెల్లో
తంగేడు కిందున్నా బరువు మోస్తది శ్రమ మంతురాలు
నిలువెత్తుగా అల్లుకునే పూలన్నీ వాటికి అండ
శిఖరం చేరేవి బంతి, చేమంతి, దాసన్నలవచ్చు
ప్రాణం లేని కాగితం పూలై మెరువచ్చు
ఉన్నంతరం, లేనంతరం తేడా ఎరుగనివవి
ఒకదానిపై ఒకటి నిలబడితేనే బతుకుల అమ్మలు
బతుకమ్మలకు తెలుసు తనువు శాశ్వతం కాదని
బతికున్నంతసేపు పంచుతాయి ఆనందాన్ని, ఉత్సాహాన్ని
పెంచుతాయి ప్రేమలు మనసుల్లో
చేతులు కలిపిస్తాయి, గొంతులు పలికిస్తాయి
చప్పట్లు కొట్టిస్తాయి, ఆటలకు ఊపిరవుతాయి
సద్దులు పంచుకొని తినిపిస్తాయి మమకారంగా
పూల జాతరలంటే మహిళలకే కాదు
వారికి తోడుగా నిలిచే బతుకమ్మలు పేర్చే అందరికీ పండుగ
