బరువైన మాటల్ని మోస్తూ
బరువైన మాటల్ని మోస్తూ
చేజారినయి కమ్ముకున్న ఆశలు
జీవిత చివరి అంకములో నెమరు వేస్తే
శుక్లాల కళ్ళలో నీళ్ళు తిరిగాయి
గాజు అద్దంలో గత కాలం మరకలు మిగిలాయి...
విషాదములో రాలి పడిన కన్నీళ్లు
విగత జీవులుగా పలకరిస్తున్నాయి
రెక్కలుడిగిన గ్రద్దలో జీవం పోయినట్లు
నింగిలో నిలవలేక నేలపై వాలినట్లుగా...
విషాదమెరుగని జీవితపు జాడలో
ఊహలకు ప్రాణము పోసే మెదళ్ళు
విషణ్ణ వదనంతో మిగిలిపోయే
చీకటి గుహలో వెలుగు కోసం చూసినట్లు..
మౌనం ఏవో మాటలు చెప్పాలని చూస్తుంది
మనసుపై లిఖించిన పెద్ద గ్రంథంలో
బరువైన నాలుగు మాటల్ని మోస్తూ
భవిష్యత్తుకేదో చేదోడు వాదోడుగా నిలవడానికి..
కాలం లెక్కలేని గాయాలు మిగిల్చింది
గత ఆనవాళ్లను ఉదాహరణగా చూపుతూ
మనసును పిండి పదార్థాలు చేసినట్లు
కాల ప్రవాహములో శిలాఫలకాలు నిలిపినట్ల..
విసిరేసిన ఎన్నో జ్ఞాపకాలు పలకరిస్తున్నాయి
చీకటి రాత్రి కలలో సేద తీరుతూ
సగము మూసిన రెప్పలతో తొంగి చూస్తూ
కలత నిద్రతో కబుర్లు కావ్యంగా మారుతున్నాయి..

