భ్రమలు
భ్రమలు
పరాయి పాలనను పాతరేశాక
ముందుచూపు ప్రణాళికలు, పంచవర్షాలు,గరీబీ హఠావోలు
పదేళ్ల విజన్ లు, స్వర్ణ ప్రదేశాలు, బంగారు రాష్ట్రాలు
పాలకులు మారిన కొద్దీ పథకాలకు కొత్త రంగులు
భ్రమల రాజ్యం విస్తరిస్తున్నది
ఏళ్లకేళ్లు కరిగాయి, దశాబ్దాల క్యాలెండర్లు చిరిగాయి
పల్లె నుంచి రాష్ట్రం, దేశం
ఎన్నడుగులు ముందుకేసిందో
ఎన్నడుగులు వెనక్కేసి నాలుక కరుచుకుందో
భ్రమలను తొలగిస్తుంది కాలం
కళ్ళు తెరుచుకున్నట్లే అనిపిస్తది
ఐదేళ్లకోసారి వేలిపై చీకటి సిరా చుక్క
గోరు పెరిగిన కొద్దీ తొలగిస్తే తప్ప పోదామరక
దాన్ని చూసినప్పుడైనా వెలుతురు గురించి ఆలోచించం
తుంట దించి మొద్దు ఎత్తుకున్నట్లో
మొద్దు దించి తుంట ఎత్తుకున్నట్లో మార్పు
ఏ రాయయితేనేం పళ్ళూడగొట్టేదే
పాత తరానికున్న మనిషి తనం, దేశభక్తి
మెల్ల మెల్లగా జారిపోయాయి, నీరుగారిపోయాయి
ఆర్జన, స్వార్థమే నేటి నేతలకు పూట పూటకు భోజనం
పెత్తందారులు, పెట్టుబడిదారులు, కార్పొరేట్లు
పేర్లు మారి రంగులద్దుకున్న మేకప్ లు
వారి చంకలో వాసన పాలన
భ్రమలను తొలగించడానికి చేసే ప్రయత్నాలు
నాలుక మడతేసే నాయకుల మాటలు
రాజకీయం బురద దుస్తులను బండకేసి ఉతికినా
పందిలా పొర్లుతుంది మళ్లీ బురదలో
రాజకీయం వ్యాపారంగా మారడం పెద్ద శాపం
మార్పు ఉద్యమాలు లేస్తున్నాయి ఉవ్వెత్తున
పాలనలు, పాలకులు మారినా
కొన్నాళ్లకి వెళ్ళడవుతున్నాయి పీతిరి గద్దలేనని
భ్రమలను తొలగిద్దాం
అవసరమైనప్పుడల్లా ముఖం కడుక్కున్నట్లు
అద్దానికి ఆంటిన మరకల్ని తుడిచేసినట్లు
భ్రమలపై కొనసాగుతూనే ఉండాలి పారిశుద్ధ్యం
