అస్తిత్వం
అస్తిత్వం
నీవో అర్ధ రహిత అస్తిత్వానివి..
నిర్వచనమే ఎరుక లేని ఉనికివి..
విమోహిత మానసాన రేగిన కార్చిచ్చుల
నిప్పు సెగవి..
విచక్షణ లేని మనసుల మోళీ ఆటలో
ప్రాణం లేని బొమ్మవి..
ఉద్విగ్నమే ఎరుగని భావాతీత గందర గోళానివి..
నీ మనసు చంపిన ఘడియలన్ని కొత్త మార్గాలకు
దారులు వేస్తూ.. మృత్యు గీతాల కేళితో హోరెత్తుతూనే
ఉన్నా..
కళ్ళని కాటేసిన స్తబ్దత చీకటిలో విచ్చుకుని
కెంపులై ప్రజ్వరిల్లినా..
ఎదలో తడి నెత్తుటి ప్రవాహమై ముంచెత్తుతున్నా..
మృతమైన మనసున అమృతమైన జ్ఞాపకాలు తడుతున్నా..
శూన్యం పూల గుచ్చమై నిన్ను చేరదీసినా..
బ్రతుకనే సూది మొనపై అడుగేయాల్సిందే..
ఎన్ని కొత్త దారుల్లోనైనా పయనించి..
పుట్టుకకి అర్థాన్ని నిర్వచించాల్సిందే.

