అన్వేషణ
అన్వేషణ
ప్రకృతి లోని సోయగాలకు పరవశిస్తావు
పాడే కోయిలస్వరాలకు రాగాలన్వేశిస్తావు
కఠినశిలలలో సైతం కారుణ్యం వెతుకుతావు
పారే సెలయేటి సడుల లయలను చూపిస్తావు
నింగినుంచి నేలకేదొ అనుబంధం అల్లుతావు
ఇంద్రధనువు వర్ణాలను ఊహలపై చల్లుతావు
జాబిలితో తారలాడు సరసాలను చూస్తావు
ఉషోదయపు అద్భుతాలు కనువిందులు చేస్తావు
శ్రామికశక్తిలో ఎగసేవిజయకేతనాలు దర్శిస్తావు
సైనిక త్యాగాలచరితలకు వందనాలర్పిస్తావు
కర్షకుడే ఈ జగతికి జీవనాధారమని భాషిస్తావు
కార్మికుడే అభివృద్ధికి ఆలంబనమని భావిస్తావు
మేఘాలతో సందేశాలు పంపిస్తావు
కపోతాల రాయబారాలు వినిపిస్తావు
హంసనడకలలో వయ్యారాలు ఒలికిస్తావు
మయూరనర్తనలో సౌందర్యం తిలకిస్తావు
అన్యాయాలను చూసి ఆవేదనపడతావు
ఆదర్శాలను ఆచరణలో పెట్టాలంటావు
బడుగువర్గాలకు ఆదరణకావాలంటావు
బలహీనులకు చేయూతనివ్వాలంటావు
ఇంతకీ ఈ ఆరాటమంతా నీకెందుకు?..
ఏదో తెలియచెప్పాలనే తహతహ నీకెందుకు?..
నిరంతరం ఏదో అన్వేషిస్తూ... ఆలోచిస్తూ?..
ఓహో!.. నీవు కవిహృదయానివి కదూ!..
