అంతర్జ్వాల
అంతర్జ్వాల
మంచుపల్లకిలో ఊరేగినా
మహా కిరీటాలు ధరించినా
నీళ్లలో నిలువెల్లా మునిగినా, ఈదినా
మట్టిలో విత్తనంలా కప్పబడినా
అంతర్జ్వాల వెలుగుతూనే ఉండాలి
శరీరాన్ని కనిపెట్టుకొని, కాపలాగా
అది హరించిందంటే మట్టి కొట్టుకుపోయినట్లే
అంతర్జ్వాలది ఎప్పుడూ నిశ్శబ్దమే
శరీరంలో ఎక్కడుందో చెప్పలేం
కంటికి కనిపించకున్నా
అవసరమైనప్పుడల్లా చేస్తుంది అలారం బెల్
శరీర కదలికలపై ప్రభావం చూపుతూ
బహిర్జ్వాలలు కళ్ళ ముందు ఎన్నో
విన్యాసాలు చేస్తుంటాయి రకరకాలుగా
సద్వినియోగం చేసుకుంటే దాటుతం విపత్తులు
తీటకోకిలలమైతే కాలుతుంది చెయ్యో,కాలో
ఆర్పాల్సిన చేతులు మంటలెగదోస్తే
ఇతరుల జీవితాలు బుగ్గిపాలు
చలిమంటలైతే శ్రమజీవులకు అండ
వంటలై నింపుతాయి కడుపులు
వివేకంతో వాడితే అంతులేని విజ్ఞానం
అంతర్జ్వాలలతో కుదరదు ఆడుకోవాలంటే
మనిషి ఆంతర్యాన్ని కనిపెడుతుంది
అదుపు తప్పితే హరిస్తుంది మనిషినే
అంతర్జ్వాల ఒక అగ్నిపర్వతం
బద్దలైతే ఆపతరం కాదెవరికి
జ్వాల లేవైనా జ్వాలలే
నిండు వెలుగులు
జ్వాల నుంచి జ్వాల జనిస్తుంటే
కొనసాగుతుంది తిమిరంతో సమరం

