అందరినీ
అందరినీ
ఆకుపచ్చ మాదేశం..ఆదరించు అందరినీ..!
అతిథివిలువ ఊపిరవగ..పలకరించు అందరినీ..!
మాదేశపు మట్టిరుచిని..మరువలేరు ఎవరైనా..
అమ్మప్రేమ లోగిలియై..కనికరించు అందరినీ..!
ఇచటిగాలి సోకిందా..వికసించును ప్రతిహృదయం..
వికారాలు పేల్చివేసి..సంస్కరించు అందరినీ..!
శుభపావన తీర్థమిచటి..శ్రీగంగా వాహినియే..
సేవించే భాగ్యమిచ్చి..ఉద్ధరించు అందరినీ..!
గురుతత్వం సంపదగా..అలరారే జ్ఞాననిధే..
దివ్యమైత్రి పెంచుదారిగ..నడిపించు అందరినీ..!
కలనైనా వెంటాడే..యుద్ధభయమె నెలకొంది..
ఏదోయీ స్వాతంత్య్రం..నిలువరించు అందరినీ..!
