అమ్మ చూపు
అమ్మ చూపు
అద్భుతమౌ ప్రేమపూల..వానంటే అమ్మచూపు..!
చదువు నేర్పు మౌనమైన..భాషంటే అమ్మచూపు..!
అమృతమేదొ అందుతుంది..గోర్వెచ్చని ఆ స్పర్శన..
వెన్నునిమిరి నిదురపుచ్చు..పాటంటే అమ్మచూపు..!
కాలానికి ఎదురీదే..జ్ఞానమిచ్చె స్థన్యమిచ్చి..
సర్వస్వం తానయ్యే..కోటంటే అమ్మచూపు..!
సేవలెన్ని చేసేనో..తిరుగేమీ కోరకుండ..
మైమరపుల కోటినదుల..ఊటంటే అమ్మచూపు..!
నాన్న కోపపడుతుంటే..అడ్డుపడును మాటాడక..
కమ్మనైన పున్నమింటి..తేటంటే అమ్మచూపు..!
