ఆవేదన
ఆవేదన


వినీలకాశపుటంచున
సంప్రదాయపు వృక్షశాఖకు వ్రేలాడే
కట్టుబాట్ల పంజరంలో బందీనై ఉన్నా!
పురుషాధిక్య ప్రపంచంలో
సతంత్రంగా సంచరించే సాహసాన్ని చేయలేక
అంధకార బంధురంలో మేలిముసుగు నీడలో దాగున్నా!
కులం కుమ్ములాటల మధ్య
మతం మరక పూసుకుని
స్వేచ్ఛగా సంచరించే జనారణ్యంలో
బంగారపు పంజరంలో బొమ్మనై కూర్చున్నా!
ఆత్మకేమో ఆరాటం
విహగంలా గగన వీధిన స్వేచ్ఛగా సాగాలని,
శరీరాన్ని వీడి నిర్భయంగా ఎగిరేను
యధేచ్చగా నింగికెగసెను
నేనుమాత్రం గారాభం పేరుతో
పద్ధతుల హద్దుల మధ్య
పంకిలపు అత్తరు పూసుకుని
జీవచ్ఛవంలా బ్రతుకుబండిలో
బంధీనై జీవితాన్ని నిస్తేజంగా గడపాల్సిందే!