తిరిగి రాని కన్నీరు
తిరిగి రాని కన్నీరు
నాన్నా
నీమీద అరిచా
కోప్పడొద్దు నామీద
వయసైయిపోయి
విశ్రాంతికి వచ్చిన నిన్ను
నేను పోషిస్తున్నానన్న అహం
ఏమూలో దాగిందనుకొంటా
ఇన్నాళ్లుగా
నువ్వు పోషించిన ఈ శరీరం
ఎంత స్వార్ధంగా ఆలోచించిందో
వయసులో ఉన్న భార్య
కొత్త జీవితంలో ఏకాంతం కోసం
నిన్ను తరిమేయాలనుకుందేమో
అబద్ధాల మేడలు కట్టేసింది
ఉదయం వెళ్లిపోయే నేను
అలసిన మనసును
సరిగా బ్యాలెన్స్ చెయ్యలేక
ఏమనలేని నిన్ను కసరుకొన్నాను
నాన్నా నిన్ను విసుక్కున్నాను మళ్ళీ
నన్ను చదివించేందుకు
నువ్వు కోల్పోయిన ఆనందాలు
అమ్మ వదిలేసిన ఆరోగ్యాలు
నన్ను పెద్దవాడ్ని చేసాయి
అరవై ఏళ్ల అమ్మ మరణంలో
నీవెంత కోల్పోయావో
మెల్ల మెల్లగా అర్ధం ఔతొంది నాకు
ఆసరా నిచ్చి గోరుముద్దలు పెట్టిన అమ్మ
మరణంలో నీ బాధ నా కర్ధం కాలేదప్పుడు
ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించి
పెరిగిన అప్పులకు వడ్డీల భారంతో
ఎండిన నీ పెదాల మీద దరహాసం ఖరీదు
నా గొంతెమ్మ కోర్కెలకై
అరగదీసిన నీ శరీరం విలువ
నాకిప్పుడిప్పుడేఅర్ధం అవుతుంటే
అమ్మ పనిమనిషై చేసిన సేవలు
విరిగిన కళ్ళద్దాలు..
అతికేందుకు పట్టిన సంవత్సరాలు
ఇప్పుడిప్పుడే అర్ధం అవుతున్నాయి నాన్నా
నేను చేసిన తప్పులన్నీ
శాపాలై వెక్కిరిస్తాయన్న భయం నాలో
విలువల చదువుల్ని వదిలేసి
కాసుల రాసులకై పరుగుతీసి
వయసులోనే నిన్ను ముసలాడిని చేశా
మీ ఆకలి చంపుకొని
నాకోసం పెట్టిన గోరుముద్దల ఆప్యాయత
మళ్ళీ నాకు పంచివ్వు నాన్నా
పెరుగుతున్న నాకొడుకు
నాలో లోపాన్ని కళ్ళముందే ఎత్తిచూపి
పెంచలేని నన్నెందుకు కన్నావ్ అన్నపుడే...
నీ విలువ ఇప్పటికి అర్ధం అయింది
నన్ను క్షమించి ఇంటికి రా నాన్నా ఎక్కడున్నా...
--------------****************--------------------
(నాన్న లందరూ ఇలాగేనా?)