ఆర్తి గీతాలు
ఆర్తి గీతాలు
నేనేమి రాయాలి కొత్తగా
రణస్థలం లా మండుతుంది ప్రతి చోట
ఆర్తి గీతాలు నిత్య పారాయణం గా
మైనపు వత్తుల్లా జీవితం కరిగిపోతుంది...
మనసుల మధ్య ఆత్మీయత కరిగిపోయి
మాటలతో పరిసరాలను రణరంగం చేస్తూ
ఆత్మాహుతి దళంలా ఆయుధాలు విసురుతూ
పాత మాటలను కొత్త రాగాలతో పలికిస్తున్నారు...
దేశము నిండా అత్యాచారం సంఘటనలు
కనపడిన మాతృత్వాన్ని దొంగలిస్తూ
ఎన్నో గర్భకోశాలను సమాజంలో కలిగిస్తూ
సంచరించే కామ మృగాల నిత్య కేళి విలాసం...
ఆయుధము పట్టని అరాచకాలు ఎన్నో
నడిరోడ్డుపై వికటాట్టహాసం చేస్తూ తిరుగుతుంటే
కళ్ళు మూసుకొని వ్యవస్థ నిద్రపోతే
సామాన్యుడి ఘోష సముద్రపు అలలా దాటిపోయింది..
స్మశానానికి వెళ్తున్న దేహాలకు ఎన్నో ప్రశ్నలు
హత్య ఆత్మహత్యలతో మట్టిలో కలుస్తూ
జవాబు లేని ప్రశ్నలా మిగిలిపోతుంటే
పరిపూర్ణ జీవితానికి విషపు గుళికలే మిగిలితే...
ఆకలిలో గొంతు దాహం తీరడం లేదు
ఎర్రటి మెతుకుల్లో కనిపించే ఆర్తనాదం
వేల బతుకుల్లో మండుతున్న పేదరికం
రుధిరపు అక్షరాలే దర్శనమిస్తున్నాయి...
ముగింపు లేని వాక్యాన్ని వేధిస్తున్నాయి
రాసిన కాలం కన్నీళ్లను నింపుతుంది
మనోవేదన లో అక్షరం అగ్నిహోత్రంలా జ్వలిస్తే
పుట్టిన ఆలోచన పురిటి లోనే నశిస్తుంది..
