ఆరాటం
ఆరాటం
ప్రియసఖునిగ మిగలాలని..విరహానికి ఆరాటం..!
చెలిగళమున పొంగాలని..రాగానికి ఆరాటం..!
కనిపించని నీకోసం..వెతుకులాట తరగనిదే..
వేదనలను కాల్చాలని..మోహానికి ఆరాటం..!
కృతజ్ఞతగ ఉండలేని..మనసుకన్న నరకమేదొ..
స్వర్గసుఖం కావాలని..గంధానికి ఆరాటం..!
ఉపాధియౌ తనువుకింత..ఉపశాంతిని ఇచ్చుటెలా..
జవాబేదొ పట్టాలని..ప్రాణానికి ఆరాటం..!
అంతరంగ గగనాలను..తిరిగివచ్చు తీరేదో..
భోగాలను రాల్చాలని..త్యాగానికి ఆరాటం..!
మౌనమెంత నిశ్చలయో..నిర్భరయో గమనిస్తే..
ఒక సాక్షిగ మిగలాలని..హృదయానికి ఆరాటం..!
