ఆకాశమంతా
ఆకాశమంతా
ఆకాశమంతా నువ్వు పరుచుకున్నాక..
మబ్బుల్లో తెలి మబ్బునై నేను నీలో
నిండిపోయాను..
వాన చుక్కెరుగని దాహమల్లే..
మోమెత్తి వానని అర్ధించినప్పుడు..
మబ్బుల జాడల్లో నీలి ముత్యాల
ధారనై నీ మనసు మడిని తడిపే
తొలకరిలా అవతరించాను..
చూపుల పూలు విసురుతూ..
నువ్వు పూల తోటై పరిమళిస్తుంటే..
రంగుల సీతాకోకనై..
నీ పరిమళాలను దాచుకున్నాను..
అత్తరు బుడ్డీలా నువ్వు సుగంధాలు
ఒంపుతుంటే..
గుభాళించే జ్ఞాపకాల పుటలా
నీ మనసు పుస్తకంలో దాగున్నాను..
కవితై నీ భావ సిరులు జార విడిచిన
చోటు..
విత్తునై నీ మనసు పూల తోటని
పెంచుతూ.. నీ తలపుల తడి వానల్లో
తడిచిపోతూనే ఉన్నాను..

