"ఆగిపోయానా !, అలసిపోయానా !!"
"ఆగిపోయానా !, అలసిపోయానా !!"


తోటివారితో పోటీపడుతూ ...
జీవితంలో ముందుకు వెళ్లాల్సిన నేను..!
ఎందుకని లేనిపోని ఆలోచనలతో
మధ్యలోనే ఆగిపోయాను ?
చేదు జ్ఞాపకాలను మిగిల్చిన ఇంకా ఆ గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే !
పెట్టుకున్న లక్ష్యాలు, చేరుకోలేని గమ్యాలు ప్రశ్నించవా నీ భవిష్యత్తు ఏమిటని ?
కన్న కలలు చిదిమేసి మధ్యలోనే వెళ్లిపోయిన
"ఓ మగువా నువ్వెక్కడ ? " అంటూ
తన రాక కోసమా నేను నిద్రలు మాని పగటి కలలు కంటూ ఇంకా ఎదురు చూసేది ?
నేను వలచింది గీత దాటని సీతే కావొచ్చు...!
కానీ, తాను మాత్రం నా రాతలో లేని రాధగా వంచించి పోయిందని ఇకనైనా గ్రహించలేకపోయానా...?
నా లక్ష్యాన్ని ఎవడో స్వార్థంతో కాలరాస్తే, ఆ మార్గంలో చాలా దూరం ప్రయాణించానని బాధ పడతూ ఇంకా అక్కడే ఆగిపోయానా ?
అయినా... దారితప్పిన గమ్యాలన్నీ ఏదోక గమ్యాన్ని చేరతాయని గుర్తించలేక పోయానా?
ఇంత కాలం ముగిసిన కథ దగ్గరే అలసిపోయి కూర్చున్నానా ?
పాత కథకు ముగింపు పలికితేనే కదా..
కొత్త కథకు నాంది పాలకుతానన్న విషయాన్ని గమనించలేకపోయానా ?
తోటివారంతా ఏదోక పని చేసుకుంటూ జీవితంలో రోజురోజుకీ ఎదుగుతూ స్థిరపడుతుంటే,
నేను మాత్రం ఇంత కాలం స్థిరత్వం లేని మనస్తత్వంతో ఇలా ఒంటరిగా మిగిలి దిగజారిపోతున్నానా ?
ముడ్డి కిందకు ముప్పై వచ్చినా...
ఇంకా అలా చచ్చు పడినా శవంలానే ఉంటే,
నన్నే నమ్ముకుని బ్రతికుతున్న నా తల్లిదండ్రుల ఆశలు ఇక అడియాసలేనా ?
ఇప్పటి వరకూ చెప్పిందంతా నాణానికి ఒకవైపు పైకి నేను కనిపించేది...
ఇప్పటి నుండి చెప్పిందంతా నాణానికి రెండోవైపు నా లో దాగుండేది...
అనుకోని అతిథిలా బాధ్యతలు చుట్టుముట్టగా
కొనితేరి తెచ్చుకున్న కష్టాలు చుట్టూ అల్లుకోగా
నష్టాలతో నలిగిపోతూ
వదిలేసుకున్న ఇష్టాలెన్నో కదా !
కొన్ని నా ఆలోచనలకు పదును పెడితే ,
అక్షారాలై కవితలా కురిసాయి ఇలా !
మరికొన్ని నా అతి ఆలోచనలు వాటికవే పదునెక్కి,
నా కలల రాజ్యాల్ని కూల్చేసాయి అలా !
మానవత్వంలో కఠినత్వం చూపించే
ఈ స్వార్ధపు సమాజంలోనా ...
నేనీ మనుషుల మధ్య అంధత్వంతో
సమానత్వాన్ని వెతుకుతూ భావోద్వేగమయ్యేది ?
దృఢంగా లేచి నిలబడితేనే కదా నేను ఎదుర్కొనేది అలో, కెరటమో లేక ఉప్పేనో తెలుసుకునేది ?
పడినా...మళ్ళీ లేచి నిలబడుతూ,
ప్రయత్నాలకు బానిసనయ్యానా ?
ఓడినా .. తట్టుకుని మళ్ళీ పోరాడుతూ,
కన్నీళ్లను కళ్లదగ్గరే నిలుపుకున్నానా ?
సాధించడంలో, సంపాదించడంలో గెలవలేకపోయానా ?
లేక ప్రయత్నించడంలో, పోరాడడంలో ఓడలేకపోయానా ?
అసలు గెలవడంలో... నే ఓడిపోయానా ?
లేక, ఓడిపోవడంలో... నే గెలిచానా ?
నా దారిని మలిచానా ? నా గమ్యం మరిచానా ?
చుట్టాలు పట్టించుకోలేదని
స్నేహితులు మొహం చాటేసారని
సన్నిహితులు దూరమయ్యారని
నమ్మిన వాళ్లు మోసగించారని
ప్రేమించిన వారు దూరమయ్యారని
ఇంకా అలా బాధపడుతూనే కూర్చుంటే
నాకు జరిగిన ప్రతీ అవమానాలకు...
జరిమానాలు తప్పక విధించగలనా?
సన్మానాలు పొందిన ఆ రోజు నేను పొంగిపోయానా ?
అవమానాలు ఎదుర్కొన్న ఈరోజు నేను కృంగిపోయానా ?
60 అక్షరాలతో తీర్చి దిద్దిన ప్రతీ పదం
24 పదాలతో పేర్చిన ప్రతీ వాక్యం
30 వాక్యాలతో అమర్చిన ప్రతీ పేరా
12 పేరాలతో సమకూర్చిన 2024 అనే
నే రాసుకున్న
ఈ మరో అధ్యాయం కూడా...
అంతకు ముందు అధ్యాయాలలా...
నా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండానే ...
ఎలాంటి ఆర్భాటం లేకుండానే ముగిసింది !
అయినా ఆగేనా..
2025 అనే మరో అధ్యాయం వైపు
మళ్ళీ
ఈ సత్యాన్వేషి యొక్క పరుగులు..!
ఈ నిత్యాన్వేషి యొక్క అలుపెరగని పోరాటాలు.. !
Written by
- సత్య పవన్ గంధం
(mr.satya's writings✍️✍️✍️)