ఆ కళ్ళు
ఆ కళ్ళు
ఆ కళ్ళకొలకుల్లోంచి.. నా కళ్ళల్లోకి....
.. కాదు గుండె కనుమల్లోకి చూస్తూ....
...పెదవి వొంపుల్లో
.. మొలక నవ్వుతో
...గొంతులో జీర..ఓ మగతనపు '"జీర" కలిపి పోస్తూ..
...మెల్లగా...చాలా.మెల్లగా...
..." బుర్రకర్థంకాదా...
..."అలా చూస్తావేం? ఎందుకంత భయం...
... ఏ ఆడదీ అన్నీ విప్పి చెప్పదురా చవటా..."
"ఎన్నాళ్ళురా....ఆఁ??!! "
" అయినా ఇంకా అన్నిమాటలెందుకూ ...
..ఒక్క ముక్కలో చెప్పు..
- కాంతి కన్య కౌగిలిలో కరిగి శూన్యమౌతావా !?!?!?!"..." అని అడిగింది,..
నేను కళ్ళప్పగించి చూస్తున్నా....
మాటపడిపోయిన నన్ను చూసి పగలబడి నవ్వీ...
గుచ్చి గుచ్చి..చూస్తూ...
కళ్ళెగరేసింది...
తను కళ్ళెగెరేసిందా ?
అసలు నన్నే ఎగరేసిందా?!! .
...సరిగ్గానే విన్నానా..నిజాన్నే చూస్తున్నానా..?
నా మీద నాకే అనుమానం.!
...మెల్లగా తెల్లని సందెమబ్బు చీరకి
వెండి అంచులపైట కొంగు చివరతో
చల్లని గాలిని నా మీదకు తెస్తూ...
ఒళ్ళంతా కాంతుల కాంచనమైనట్టు...
అదంతా అప్పగించ బోతున్నట్టు...
కళ్ళల్లో కళ్ళుపెట్టి అలా...చూస్తూనే వుంది.
.
ఎంత అందం.!
ఎంత రాజసం..!
ఎంత సౌందర్యం..!
ఎంత ఆత్మవిశ్వాసం.!
- నన్ను నేను మరచిపోతున్నాను.. ..........
అసలు అదంతా అందమేనా?
అదంతా..అంతా సౌందర్యమేనా?
ఏమో కాదనిపిస్తుంది.!
ఖజానాలో కానీ లేకపోయినా జననం నుంచీ మరణం దాకా "నేను రాణినిరా.. మహారాణినిరా.!" అన్నట్టు కూర్చుంటుంది...!!!
అది అహమో.. రాజసమో...
తన మీద తనకున్న నమ్మకమో...
ఈ లోకంలో నిరంతరం శ్రమిస్తూ..
ఎంత కష్టమైనా ఓర్చుకుని
ఈ సృష్టిలో వున్న సృష్తించే తత్త్వమంతా
తన శరీరం అణువణువులో నిండి వుందన్న ఎరుకో....ఆత్మస్థైర్యమో..
అసలు వాటన్నింటినీ మించిన .
నిస్వార్థ ఆలోచనా గంధమో..
వికసిత వినిర్మల హృదయ సుగంధమో.. !
ఏమో...ఏమో...
ఏమీ తెలియడం లేదు. !!
.
ఒక క్షణంలో ఎంత పొగరు? ఎంత పొగరూ..!! ఎంత పొగరు దీనికీ?! అనిపిస్తుంది.!!!
మరుక్షణంలో హిమాలయం పక్కకి వొచ్చి కుంగి, వొంగి
పక్కన నడుస్తున్నట్టుంటుంది.!!!
ఇంతటి వినయమా.!.. ఎంత పెద్దమనసూ..!! అనిపిస్తుంది.
ఎంతటి క్రమశిక్షణ..
ఎంతటి సమయ పాలన..!
త్రికాలాల్ని తనే శాసిస్తున్నట్టు...
త్రి సంధ్యలకూ సమయాన్ని తానే ఇస్తున్నట్టు..,
త్రినేత్రుణ్ణి సొంతం చేసుకున్నట్టూ.
సవినయ చక్షువులతో.. నిస్వార్థ విచక్షణతో..!
గుండెకనుమల్లోంచి
వెచ్చని కన్నీటి చలమల చెమ్మ చల్లాగా జాలువారుతున్నట్టూ...
ఎన్ని రంగుల కలనేతో ఆ మనసూ...
ఎన్ని వైరుధ్యాల కలబోతో ఈ మనిషీ" అనిపిస్తుంది.
అసలు మానవ సాధ్యమా..!!
ఎవరు నేర్పారో ఇంతటి సంస్కారం...!!!
ఇదంతా..ఈమె సొంతమా.. ఈమెకే సొంతమా? అనుకుంటూ...అనుకొంటూ...
...
నేనా ఆ ఆశ్చర్యంలో వుండగానే...అప్పటికప్పుడే...
అంతే... అంతలోనే.అంతలోనే
ఇంత తుంటరి..ఇంత అల్లరి.. ఇంత చిల్లర వల్లర చిందర వందర చింపిరి తెంపరిది.... ఇంకెక్కడా వుండదనిపిస్తుంది.
దీన్ని భరించడం.. దీన్ని సహించడం..
ఎవడి వల్ల..ఎవడివల్ల.. ఎవడివల్లౌతుందిరా....!!!!" అనిపిస్తుంది
...
కాసేపట్లో మొత్తం మారిపోతుంది. !
సాయం సంధ్య కాగానే...
సృష్టిలోని సౌందర్యమంతా తాను సొంతం చేసుకున్నట్టు,..
కలబోసుకు కూర్చున్నట్టు,
నీలి నీలి నీరవమంతా కలిసి నింగినంటుతున్న ఎగసి నీహారాద్రిగ నిలువెత్తున నిలుచున్నట్టూ..నిస్వార్హంగా నడిచొస్తున్నట్టూ.. చూస్తున్నట్టు......
ఓ చూపు..! .
... ఆ చూపులో..
ఆ కనుపాపల తడి కళ్ళల్లో.. ఓ గుండె తడి..!.
...
అన్నీ తెలిసి కూడా ఏవీ ఎరగనట్టు..అడిగే ప్రశ్నలు !..
చురుక్కున తిరిగి చూస్తే...
ఏమో నాకేం తెలుసూ..అన్నట్టు.ఎక్కడలేని అమాయకత్వ నటన.. ప్రదర్శిస ప్రదర్శన...
అడుగడుగునా.. ప్రశ్నలు..ప్రశ్నలు..ప్రశ్నలు..
... విసుగెత్తించేస్తూ..
నమ్మినా అనుమానిస్తుందో...అనుమానించి నమ్ముతుందో...
అపనమ్మక - నమ్మకాల కలనేత తత్త్వం..
అబ్బా.. ఇలా చంపుకు తింటుందేంట్రా అనే మనస్తత్త్వం..
దెయ్యంలా పట్టిన దివ్యత్వం..
గిద్దెడు సోలలో కుంచెడు పాలు పోస్తాననీ పొయ్యాలనీ చూసే మొండితనం,..అనవసర వాచాలత్వం
..అంత కష్టపడి కాచిన కడివెడు పాలలో
ఇంత ఉప్పురాయి పడేసే దుందుడుకు తత్త్వం..ముట్టెపొగరు మూర్ఖత్వం
... అదంతా తట్టుకోలేక "దీని దుంప తెగ దీన్నీ... బడిత పూజ చేసేవాళ్ళు లేకా." !!..
అనిపించే బండమొండితనపు అర్థంకాని తత్త్వం ...
అన్నీ కలిసి..మెలసీ.. వెరసి...అయోమయత్వ స్త్రీ త్వం...
అసలు సిసలైన ఆడతత్త్వం.....
.
అంతలో చేసిందంత మరచినట్టు అసలేమీ చెయ్యనట్టూ.. వచ్చి
... "ఇదెంత బావుందో ... చిలక్కొరికిన జాంకాయ్.. ఇంద తిను..బావుంది.
"ఆడది తియ్యగా వుంటుందో లేదోగానీ మగాడంటే మాత్రం కారమే.." నీకిష్టం కదా అనీ.. ఈ దోరకాయ కాయ చెట్టెక్కి కోశా.. దిగుతుంటే...
దిగలేదులే...దూకా... కొమ్మ గుచ్చుకుంది.!"
అని కాలి పిక్కపై కందిన చోటు చూపించింది.
కందిన చోటు చూపిస్తోందో...
కందని అందం కందేట్టు..చెయ్యమంటోందో.. "
అర్థంకాక వెర్రిమొహం వేసి చూస్తున్నా...
.
ఓ కంటి చుక్కతో..ఓ గుండె చెమ్మతో..!!
"అయినా... నాకు కొంచెం నోరెక్కువ కద..
తిట్టకు.. నాకు తెలుసు నువ్ మంచోడివని..!
నాతప్పు నువ్వు చెప్తే ఒప్పుకోబుద్ది కాదు.
.. బదులిస్తేనే గొడవ..
కొంచెం ఓర్చుకోవచ్చుగా... అంత రోషమెందుకూ..!
నువ్వంటే నాకెంతిష్టమో నీక్కూడా అర్థంకాదా..!" -
.
క్షణకాలం కొంచెమెక్కువ అరిచానేమో అని ఏదో బాధ నాలో..
...
అంతే అంతలోనే.. సాయం సంధ్యగా మారి..
..చల్లగా మెల్లగా.. చేరి...అల్లరి నవ్వుతో..తుంటరితనంతో...
"చలేస్తోంది కద..".
....
అయినా...అంత సిగ్గులేకుండా పడే రోషం లేని మగాడెవడుంటాడ్లే.!
ఉన్నా..వాడేం నచ్చుతాడు ఆడదానికి " అంటూ
బాగా దగ్గర కొచ్చి..
.. "మీరు" లోంచి "నువ్వు" లోకి వచ్చి...
హృదయ అగాధం ఆంచుల్ని తాకేట్టు చూస్తూ...
..ఓ కనుబొమ పైకెత్తి విలాసంగా మెల్లగా...
" వెన్నెల హస్తం స్పర్శ' ఎలా వుంటుందో తెలుసా?.."
అని..అడిగి, ఆగింది...
- తెలుసన్నానో తెలియదన్నానో తెలియదు..
ఏదో మత్తు
అది పుష్ప గంధమో... శరీర సౌగంధమో..తెలియదు.
... తను నా చెయ్యిలాగుతోందో
నేనే తనవేపు వెళుతున్నానో తెలియదు.
..తర్కానికందడం లేదు...తెలివికి తెలియడం లేదు.!
..
ఇంతటి మహా మహా మహా సృష్టిని సృజించే సంపూర్ణ స్త్రీ త్వం ముందు,
నిలిపి, నిలబెట్టి నిలువు నిలువునా పురుషుణ్ణి శూన్యం చెయ్యగల
పరమోన్నత స్త్రీ సౌందర్యం ముందు..
సమ్మోహన మోహన శక్తి ముందు,
మోద ప్రమోద యుక్తి ముందు,
ఆ లాలిత్యం ముందు, ఆ సున్నితత్త్వం ముందు,
పురుషుడెంత...ఎంత.. ఎంత..ఎంత బలహీనుడో..
ఎగశ్వాసలో నిలిచిపోయిన ...నా శ్వాసనూ..
మౌనమైపోయిన.. నా మాటనూ..చూసి...చెప్పచ్చు...
ఆ శిరోజాల గిలిగింతల చీకటిలో .కరిగి శూన్యమౌతున్నానో..
ఆ శక్తిరహిత శక్తిలో.కలసి పూర్ణమౌతున్నానో...
అసలే తెలివిలేని నా మెదడు...
పూర్తిగా ఆలోచించడం మానేసింది...! -
..
.

