తోడు (కథ )
తోడు (కథ )


*తోడు*(కథ )
ఆఫీసు నుండి ఇంటికి వచ్చింది సుజన. లిఫ్ట్ దగ్గరకి వచ్చేసరికి కొంతమంది కూలీలు సామాన్లు పైకి తీసికొని వెళ్తున్నారు. 'అపార్ట్మెంట్ లోకి కొత్తవాళ్ళు వచ్చారు కాబోలు 'అనుకొని
"వాచ్ మాన్!ఎవరొచ్చారు?" అంది సుజన
"పెద్ద వాళ్ళు వచ్చారమ్మా!రిటైర్ అయిపోయిన వాళ్ళు."అన్నాడు వాచ్ మాన్.
సుజన వాళ్ళ ప్రక్క పోర్షన్ అప్పటిదాకా ఖాళీగా వుంది. ఎవరికో అమ్మేసారు అని తెలిసింది కానీ ఎవరికి అమ్మారో తెలియలేదు. ఆ ఫ్లాట్ ఓనర్ వేరే ఊర్లో వుంటాడు
అంతకు ముందు పక్కింట్లో అద్దెవాళ్ళు ఉండేవాళ్ళు.
' ఇప్పుడు కొత్తగా ఎవరో కొనుక్కొని వచ్చారన్నమాట 'అనుకుంటూ పక్కింటి వైపు చూసింది. ఒక పెద్దాయన సామాను దింపిస్తున్నాడు. ఆయన్ని చూసి నవ్వుతూ నమస్కారం చేసింది.
అయనకూడా నవ్వుతూ
"ఇప్పుడే ఈ పోర్షన్ లోకి వచ్చాము. నా పేరు ప్రకాశరావు. ఏ. జీ. ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యాను.."అంటూ "మీనా! మీనా!"అని పిలిచాడు. నుదిటి మీద పెద్ద బొట్టు, నిండైన విగ్రహం, నేత చీర కట్టుకొని ఉన్న పెద్దావిడ వచ్చింది.
"మా ఆవిడ మీనాక్షి "అంటూ పరిచయం చేసాడు ప్రకాశరావు.
నమస్కారం పెట్టింది సుజన.
పరిచయాలయ్యాక "మీరు కొత్తగా వచ్చారు కదా!సామాను కూడా సర్దుకోవాలి. నేను మీకు భోజనం తెచ్చిపెడతాను."అంది సుజన.
మీనాక్షి నవ్వుతూ "మీరేమీ శ్రమ తీసికోకండి!మేము క్యారియర్ తెచ్చుకున్నాము. సామాను అంతా వీళ్ళే సర్దిపెడతారు. నాకు ఎక్కువ శ్రమ ఏమీ లేదులెండి!అంది.
కాసేపు కూర్చుని తమ గురించి చెప్పి, పనిమనిషి, పాలవాడి నెంబర్లు ఇచ్చి తమ పోర్షన్ లోకి వచ్చింది సుజన.
సుజన కాలేజీలో ఫిజిక్స్ లెక్చరరుగా పనిచేస్తోంది. ఆమె భర్త రమేష్ ఆరేళ్ళ క్రితం యాక్సిడెంటులో పోయాడు. ఒక్కతే పాప పద్మిని స్కూల్లో ఎయిత్ క్లాసు చదువుతోంది. సుజనకు తోడుగా తల్లి పద్మజ తండ్రి శ్రీనివాసరావు వచ్చి ఉంటున్నారు.
"పక్కింట్లో కొత్త వాళ్ళు వచ్చారు నాన్నా!"అంది సుజన.
"చూసాను. సామాన్లు దింపుతున్నారు పనివాళ్లు. ఇప్పుడు వాళ్ళు హడావుడిగా వుంటారు కదా. కాసేపాగి పలకరించి వస్తాను "అన్నాడు శ్రీనివాసరావు.
"ఎప్పటినించో పక్క ఇల్లు ఖాళీగావుంది. వీళ్ళు వచ్చారు. కాస్త మనకు పలుకుతోడు."అంది పద్మజ.
* * * * * * * * * * * *
ప్రకాశరావు, మీనాక్షీలతో త్వరగానే కలిసిపోయారు పద్మజా , శ్రీనివాసరావులు. పొద్దున్నే కలిసి మగవాళ్ళిద్దరూ వాకింగుకు వెళ్ళిరావటం, కలిసి కూరలు తెచ్చుకోవటం, సాయంత్రాలు మాట్లాడుకోవటాలు ఇలా సాగుతోంది దినచర్య.
ఇక ఆడవాళ్ళయితే పని ముగించుకొని కాసేపు కబుర్లు చెప్పుకోవటం, కలిసి పేరంటాలకు వెళ్ళటం దేవాలయానికి వెళ్ళటం ఇలా సాగిపోతున్నది వారి దినచర్య.
వీళ్ళ రాకతో తల్లికి,తండ్రికి మంచి కాలక్షేపం జరుగుతున్నందుకు సుజనకు కూడా సంతోషంగా ఉంది.
అంతకు ముందు ఆ పోర్షనులో ఒక యువజంట ఉండేవాళ్ళు కానీ వాళ్ళు పక్క వాళ్ళతో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు. ఏదో అంటీముట్టనట్లు ఉండేవాళ్ళు. వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత ఆ పోర్షను చాలా కాలం ఖాళీగా ఉంది. ఇప్పటికి వీళ్ళు రావటంతో శ్రీనివాసరావు దంపతులకు చాలా ఆనందంగా ఉంది. పైగా ఇద్దరిదీ ఒకే కులము కావటం కూడా ఒక రకంగా వారి స్నేహం పెరగటానికి కారణమయ్యింది.
ప్రకాశరావు, శ్రీనివాసరావుల సంభాషణలలో తరుచుగా సుజన గురించే ప్రస్తావన వస్తుండేది.
"చిన్నపిల్లకదా!సుజనకు మీరు మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు ఎందుకు మొదలు పెట్టకూడదు?"
అని ప్రకాశరావు అడగటంతో నిట్టూర్చాడు శ్రీనివాసరావు.
"ఏమిటో!చేసుకోవాలని లేదు అంటుంది. చాలా సార్లు చెప్పి చూసాను. పాప ఎయిత్ క్లాసుకు వచ్చింది. చిన్నపిల్ల పద్మిని స్టెప్ ఫాదరుతో అడ్జస్ట్ అవటం కష్టమని మళ్ళీ పెళ్లి వద్దంటున్నది. సుజన గురించి మాకు దిగులుగానే ఉంటుంది. ఏమి చెయ్యాలో తోచటం లేదు. మాకేదయినా అయితే అమ్మాయి మరీ ఒంటరిదయిపోతుంది.. ఎటూ చెప్పలేక, ఏమీ చెయ్యలేక రోజులు గడుపుతున్నాము."
"చిన్న పాపని చూసుకోవటానికి మీరున్నారు. మీ సపోర్టుతో పద్మినికి ఏ ఇబ్బంది కలగదని ధైర్యం చెప్పి చూడండి. పద్మిని కూడా ఎదుగుతున్న పిల్ల. అర్ధం చేసుకోలేనంత చిన్నపిల్లకాదు కదా!సుజన జీవితమంతా మోడుబారినట్లు ఉండటం ఎందుకు? ఈ కాలంలో రెండో పెళ్లిళ్లు సర్వ సాధారణమైపోయాయి."
ప్రకాశరావు మాటలకు ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నాడు శ్రీనివాసరావు.
"మీరు సుజన విషయంలో ఆలోచిస్తానంటే మా చెల్లెలి కొడుకు వున్నాడు. అబ్బాయి సాఫ్టు వేరు ఉద్యోగం. పెళ్లయింది. ఒక పాప పుట్టాక మా మేనల్లుడి భార్య కాన్సరు బారినపడి మరణించింది. మా చెల్లెలు వాళ్ళు అతడికి మళ్ళీ పెళ్ళికి ప్రయత్నాలు చేస్తున్నారు. అతని వయసుకు తగ్గ సంబంధం అంటే మొదటి సంబంధం అమ్మాయిలు దొరకటం లేదు. డైవోర్సు తీసికొన్న సంబంధాలు కానీ, ఇలా భర్తపోయిన వితంతువుల సంబంధాలు వస్తున్నాయి. నాకు మీ అమ్మాయిని చూసాక మా మేనల్లుడికి సరిపోతుందనిపించింది. సాంప్రదాయం, అలవాట్లు, ఆచారాలు మీకు, మాకు పెద్ద తేడాగా ఏమీ లేవు. మా మేనల్లుడు సౌమ్యుడు, అతనికి ఏ దురలవాట్లు లేవు. మీకు ఇష్టమయితే మనమొక ప్రయత్నం చేద్దాము!"
ప్రకాశరావు చెప్పింది వింటుంటే శ్రీనివాసరావుకు సుజన విషయంలో చిన్న ఆశ మొలకెత్తింది. కానీ చిన్నపిల్ల పద్మిని గురించే బెంగ. తల్లి రెండో పెళ్లి చేసుకుంటే భరించే శక్తి ఉంటుందా? పిల్లలు చాలా పొసెసివుగా ఆలోచిస్తారు.
ఎదుగుతున్న పిల్ల విషయంలో సవతి తండ్రిని నమ్మటమెలా? అతని ప్రవర్తన హుందాగా ఉంటుందని నమ్మకమేమిటి? తనకున్న భయాలన్నీ వివరించాడు శ్రీనివాసరావు.
"ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది. అబ్బాయి క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టే చెబుతున్నాను. మీరు అతని మనస్తత్వం, ప్రవర్తన విషయంలో వర్రీ అవకండి!చూద్దాము!ముందు మీ అమ్మాయిని కదిపి చూడండి!తర్వాత మా చెల్లెలికి కబురు చేస్తాను."భరోసా ఇస్తున్నట్లు మాట్లాడాడు ప్రకాశరావు.
* * * * * * * * * *
రెండురోజుల తర్వాత సుజనతో మాట్లాడారు శ్రీనివాసరావు, పద్మజలు.
"ఎల్ల కాలం మేము నీకు తోడుగా ఉండలేము. నీకు తోడుగా భర్త ఉన్నాడు అంటే మాకు నిశ్చింతగా ఉంటుంది.ఎంతమంది రెండోపెళ్లి చేసుకొని సుఖంగా ఉండటంలేదు? నువ్వు కొంచెం ఈ తరం అమ్మాయిలా ఆలోచించు!"
తల్లి తండ్రి మాటలకు ఆలోచిస్తూ ఉంది సుజన.
'నిజమే!అమ్మా, నాన్న చెప్పింది ఆలోచించవలసిన విషయమే కానీ పద్మిని గురించి కూడా ఆలోచించాలి 'అనుకుంటూ
"పద్మిని నాకు దూరం అవుతుందేమోనని భయంగా ఉంది నాన్నా!చిన్న పిల్ల స్టెప్ ఫాదర్ తో ఎలా అన్న విషయం ఆలోచించాలి."
"మనకు అంతా బాగుంటే ముందుకు వెళ్దాము. పద్మిని కంటే ముఖ్యం ఇంకెవ్వరూ లేరు. నువ్వు భయపడకు!నా ప్రాణం ఉన్నంత వరకు పద్మినిని చూసుకుంటాను."
కూతురుకు ధైర్యం చెప్పాడు శ్రీనివాసరావు.
ఒక వారం తర్వాత తన చెల్లెలి కుటుంబాన్ని ఇంటికి పిలిచాడు ప్రకాశరావు.
సుజనను చూచి ప్రకాశరావు చెల్లెలు అన్నపూర్ణకి , బావగారు గంగాధరరావుకి తృప్తిగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి సంజయ్ నలభైయి ఏళ్ళుంటాయి. మనిషిని చూడంగానే స్నేహశీలి అనిపించింది శ్రీనివాసరావు దంపతులకి. సంజయ్ కూతురు మల్లికకు ఏడేళ్లు. చిన్నపిల్ల ముద్దుగా అందరితో కబుర్లు చెప్తూ ఉంది. పద్మిని కూడా మల్లికను ఆడిస్తూ కూచుంది.
బాల్కనీలో సంజయ్, సుజన కూర్చున్నారు. కాసేపు అతని ఆఫీసు విషయాలు, సుజన. కాలేజీ విషయాలు మాట్లాడుకున్నారు. అంతకంటే అక్కడ ఏమీ మాట్లాడలేదు సంజయ్.
కాస్సేపటికి అందరి దగ్గర సెలవు తీసికొని బయలుదేరారు సంజయ్ వాళ్ళు.
"అబ్బాయి బాగానే ఉన్నాడు. మాట తీరు అదీ బాగానే ఉంది. మీ కెలా అనిపించింది?"
ఇంటికి రాగానే భార్యను, కూతురిని అడిగాడు శ్రీనివాసరావు.
"నాకయితే ఫరవాలేదు అనిపించింది... సుజనా!నీ కేమనిపించింది?"
అడిగింది పద్మజ.
"బాగానే మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడే ఎలా చెప్పగలం?"
"చూద్దాము తల్లీ!మనం తొందరపడొద్దు.ఇంకో సారి అన్నీ విషయాలు మాట్లాడుకుందాము."
ఆరోజు వాళ్ళు ముగ్గురూ ఆలోచిస్తూ గడిపారు.
మరొక రెండు సార్లు సంజయ్ వాళ్ళు రావటం, వీళ్ళతో మాట్లాడటం జరిగింది. పద్మిని, మల్లిక కూడా కొంచెం అలవాటయ్యారు. సుజన సంజయ్ తో పద్మిని గురించి మాట్లాడేది. అతడు కూడా పిల్లలిద్దరి చదువు, భవిష్యత్తు గురించే మాట్లాడేవాడు.సుజనకు అతనితో మాట్లాడుతుంటే కొద్ది కొద్దిగా భయం తగ్గటం మొదలు పెట్టింది.
మల్లిక" అక్కా!అక్కా!"అంటూ వచ్చినప్పుడల్లా పద్మినితో ఆడుకునేది.
ఆ రోజు శనివారం.
పద్మిని, మల్లిక లూడో ఆట ఆడుకుంటున్నారు.
సంజయ్ పిల్లల దగ్గరికి వచ్చాడు.
"పద్మినీ!నువ్వు డిబేట్స్ కు వెళ్తుంటావా!"అడిగాడు సంజయ్.
"లేదంకుల్!రేడియో స్టేషనుకు వెళ్తుంటాను. కల్చరల్ పోగ్రామ్సులో పార్టిసిపేట్ చేస్తుంటాను. "
"నువ్వు డిబేట్సుకు, ఎస్సే రైటింగ్సుకు ప్రిపేర్ అవ్వు. వాటివల్ల ఇంకా షార్పుగా తయారవుతావు. కొంచెం ప్రిపేర్ అయితే చాలు !ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చెయ్యొచ్చు.నువ్వు చాలా తెలివైన అమ్మాయివి. ఇంకొంచెం ప్రయత్నించు!"
అన్నాడు సంజయ్.
పద్మినికి అతనితో మాట్లాడటం చాలా బాగుందనిపించింది.
"నువ్వు బుక్స్ చదువుతావా పద్మినీ!"
"చదువుతాను అంకుల్!"
"ఏం బుక్స్? "
ఫేమస్ ఫైవ్, హరీ పాటర్, మార్కట్వేన్ బుక్స్ ఇలా "
"ఎనిడ్ బ్లైటన్ బుక్స్ తెచ్చాను. బాగుంటాయి. జూల్స్ వెర్న్ బుక్స్ కూడా, నా దగ్గర వున్నాయి."
"జూల్స్ వెర్న్ బుక్స్ చదివాను.కానీ ఎనిడ్ బ్లైటన్ బుక్స్ చదవలేదు."అంది పద్మిని.
అతడు ప్యాకెట్ విప్పి రెండు పుస్తకాలు పద్మిని చేతిలో పెట్టాడు సంజయ్.
పద్మినికి బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం. హోమ్ వర్క్ అయ్యాక కొంచెం సేప
ు రోజూ బుక్స్ చదువుతుంది.
"రేడియో స్టేషనులో డ్రామాలకు వాయిస్ చెప్తుంటావని చెప్పారు మీ తాతగారు. అయితే తెలుగు బాగా వచ్చుకదా!"
"అవునంకుల్!అమ్మ, తాతయ్య తెలుగు నేర్పించారు. "
"తెలుగులో ఏమేమి బుక్స్ చదివావు?"
"తెలుగులో బుక్స్ ఇంకా ఏమీ చదవలేదు అంకుల్!చందమామ రెగ్యులరుగా చదువుతాను."
"తెలుగులో మంచి మంచి పుస్తకాలు వున్నాయి. నీకు నేను శ్రీపాదవారి చిన్న కథల పుస్తకాలు తెచ్చి ఇస్తాను. వాటిలో 'వడ్ల గింజలు, గులాబీ అత్తరు.. లాంటి కథలు చాలా ఉంటాయి. బాగుంటాయి."
"మీరు ఏం చదివారు అంకుల్?"
"నేను ఇంజనీరింగులో మాస్టర్స్ చేశాను. ఇప్పుడు తెలుగులో అన్నమాచార్య కీర్తనల మీద పరిశోధన చేస్తున్నాను."
"మా అమ్మ ఫిజిక్సులో మాస్టర్స్ చేసింది."
పద్మినికి సంజయ్ తో మాట్లాడ్డం చాలా సంతోషంగా ఉంది. అమ్మలాగా, తాతయ్యలాగా సంజయ్ అంకుల్ చదువుకొన్నవాడు.
ఒక నెలరోజులు గడిచాయి. పద్మిని అప్పుడప్పుడూ సంజయ్ తో కెరీర్ గురించి, పుస్తకాల గురించి మాట్లాడుతూ ఉంది.
ఆ రోజు పద్మిని హోమ్ వర్క్ చేసుకుంటూ ఉంది.
శ్రీనివాసరావు మనవరాలి పక్కన కూర్చున్నాడు.
"హోమ్ వర్క్ అయిందా బంగారూ!"
"అయిపోయింది తాతయ్యా!"
"నీతో ఒక విషయం మాట్లాడాలి "
"చెప్పండి తాతయ్యా!"
"నువ్వు కొంచెం ప్రశాంతంగా విను!సంజయ్ అంకుల్ గురించి నీ అభిప్రాయం ఏమిటి?"
పద్మిని కళ్ళు మెరిసాయి.
"అంకుల్ చాలా ఇంటలిజెంట్. నా డిబేట్సుకు ఏమేమి చదవాలో గైడ్ చేస్తున్నారు. అంకుల్ అంటే మీక్కూడా ఇష్టమే కదూ!"
"అవునమ్మా!మంచివాడు. మల్లిక కూడా నీకు బాగా అలవాటు అయింది కదూ!"
"అవును తాతయ్యా!బోలెడు కబుర్లు చెప్తుంది. చిన్నపిల్ల. దానితో ఆడుకోవటం సరదాగా ఉంటుంది నాకు "చెప్పింది పద్మిని.
"వాళ్ళు మన దగ్గరే ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను."నెమ్మదిగా చెప్పాడు శ్రీనివాసరావు.
"పక్కింటి తాతగారి ఇంట్లోనా? "ఉత్సాహం ధ్వనించింది పద్మిని గొంతులో.
పద్మిని చెయ్యి పట్టుకున్నాడు శ్రీనివాసరావు.
"నువ్వు కొంచెం పెద్దపిల్లవే కదా!నా మనసులో ఉన్న విషయం చెప్తున్నాను. నువ్వు అర్థం చేసుకుంటావని నమ్మకం నాకుంది. సంజయ్ అంకుల్ తో అమ్మ పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? మేము నీకు తోడుగా ఉంటాము. కానీ మేము పెద్దవాళ్లమవుతున్నాము. అమ్మ, నువ్వు ఒంటరిగా ఉండకుండా మీకు ఒక తోడు ఉంటుందని ఆలోచిస్తున్నాము. నీకు పెద్దగా మార్పు ఏమీ అనిపించదు. వాళ్ళు పక్కింట్లో వుంటారు...."
పద్మిని ముఖంలోకి చూసాడు శ్రీనివాసరావు.
పద్మిని మౌనంగా అయిపోయింది.
సంజయ్ అంకుల్ అంటే ఇష్టమే. కానీ స్టెప్ ఫాదర్ అంటే మాత్రం ఆ పిల్ల మనసుకు అంతగా రుచించలేదు.
"నువ్వు ఈ విషయంలో ఏమనుకుంటున్నావో నాతో చెప్పు!నీకు ఇష్టం లేకుండా ఏ నిర్ణయమూ తీసికోము. అమ్మ నీకు తోడుగా ఇప్పుడు వున్నట్లే ఉంటుంది.భయపడాల్సింది ఏమీ లేదు."
ఆ పసిమనసులో భయం ప్రవేశించింది.
"అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందా?"
"లేదు లేదు!నువ్వు కొంచెం పాజిటివుగా ఆలోచించు!అమ్మ ఎక్కడికీ వెళ్ళదు. నీకు అసలు ఇష్టం లేకపొతే ఈ ఆలోచన విరమించుకుంటాను."
తాతయ్య భుజం మీద తలవాల్చింది పద్మిని. శ్రీనివాసరావు పద్మినిని పొదివి పట్టుకున్నాడు.
రాత్రి సుజన పద్మిని పక్కన పడుకుంది.
"నీకు, నాకు మధ్య సంజయ్ అంకుల్ వస్తాడని నువ్వు అనుకోవద్దు. మన మధ్య ఉన్న స్నేహం పోతుందని, నేను సంజయ్ ని ఇష్టపడుతున్నానని అనుకోవద్దు. తల్లికి పిల్లలకంటే ఎవరూ ఎక్కువ కాదు. నువ్వు నాకొక్క పిల్లవి. అతని వల్ల మనకు ఇబ్బంది కలిగితుందని నాకు అనిపించలేదు. మన ఇద్దరికీ కూడా తోడుగా ఉంటాడనే నమ్మకంగా ఉంది కాబట్టి.... నీకు భయం వేస్తే నేను ఈ ఆలోచన మానుకుంటాను..."
తల్లి మాటలకు ఎటూ చెప్పలేక పోయింది పద్మిని. ఆమె మనసులో ఒకవైపు సంజయ్ అంకుల్ మంచితనం గుర్తుకు వస్తూ ఉంది కానీ అమ్మతో పెళ్లి అనేదే కొంచెం గాభరాగా అనిపించింది.
* * * * * * * * *
రెండోరోజు పద్మిని స్కూలుకు వెళ్ళింది. సునంద పద్మిని క్లాసుమేటు. సునంద అమ్మగారు మొదటి భర్తకు విడాకులిచ్చి, రెండో పెళ్లి చేసుకొంది. ఈ మధ్యే ఆమెకు ఒక బాబు పుట్టాడు. సునంద తన తమ్ముడి గురించి క్లాసుమేట్సుతో చెప్తూ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ అవరులో సునంద పక్కన కూర్చుంది పద్మిని.
"నిన్ను ఒక విషయం అడగాలి నందూ!"
"ఏమిటో చెప్పు!"
"నీకు స్టెప్ ఫాదర్ ఉన్నారు కదా!ఎలా ఉంటుంది ఇంట్లో? నీకు భయం వేయదా?"
"అమ్మ మా నాన్నతో డైవర్స్ తీసికొంది. ఆయన మా దగ్గరికి రారు. మూడేళ్ల క్రితం
అంకులుతో అమ్మపెళ్లి అయింది."చెప్పింది సునంద.
"ఎలా వుంటారు? మీ స్టెప్ ఫాదర్?"
"బాగానే వుంటారు. నేను ఎక్కువ మా అమ్మమ్మ దగ్గరే ఉంటాను.మా ఇంట్లో మా అమ్మమ్మ ఉంటుంది. రాత్రిపూట మా అమ్మమ్మ దగ్గర పడుకుంటాను. ఇంట్లో చిన్న తమ్ముడితో ఆడుకుంటాను...."
"నీకు ఫ్రీగా ఉంటుందా? ఎప్పుడన్నా కోప్పడతారా?టి. వి. చూడాలంటే ఎలాగా? వద్దంటారా?"
"ఆయన పట్టించుకోరు. నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను. కోప్పడరు. స్నేహంగానే ఉంటారు. కానీ ఎగిరి అయన పక్కన కూర్చోను. కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. పెద్ద ప్రమాదం లేదు కానీ... నేను జాగ్రత్తగానే ఉంటాను. మీ అమ్మగారు పెళ్లి చేసుకుంటున్నారా?"
"ఇంకా లేదు. నా కిష్టమయితే చేస్తామంటున్నారు తాతయ్య"దిగులు ధ్వనించింది పద్మిని గొంతులో.
"ఇప్పుడు చాలా మందికి సెకెండ్ మారేజెస్ జరుగుతున్నాయి. మన ప్రమీల మిస్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. మన క్లాసులో ప్రియ వాళ్ళ మదర్ కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. నువ్వు ప్రియతో మాట్లాడు... వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది."అంది సునంద.
పద్మినికి కొంచెం ధైర్యంగానూ, కొంచెం భయంగానూ ఉంది.
రెండో రోజు ప్రియతో మాట్లాడాక పద్మినికి తల్లి మళ్ళీ పెళ్లి చేసుకుంటే పెద్ద ప్రమాదం లేదు కానీ, ఇంట్లో స్టెప్ ఫాదర్ ఉంటే టి. వి. దగ్గర అడ్జస్ట్ అవ్వాలి. ఎక్కడికైనా అమ్మ, అంకుల్ వెళ్తుంటే వెంటపడి వెళ్ళకూడదు ఎందుకంటే సొంత తండ్రి కాదు కాబట్టి. ఇంట్లో షార్ట్స్, బనీన్లు వేసుకొని తిరగకూడదు. అడ్డదిడ్డంగా కాళ్ళు పెట్టుకొని సోఫాలో జారిగిలపడి కూర్చోకూడదు.కొంచెం పద్ధతిగా ఉండాలి. ఇవన్నీ తప్పనిసరి నియమాలు అని మాత్రం అర్థం అయ్యింది.
సాయంత్రం ఇంటికి రాగానే తాతయ్యతో తన ఫ్రీడం గురించి, ఫ్రెండ్స్ చెప్పిన విషయాలు చర్చించింది పద్మిని.
"నీకు అంకుల్ ఇంట్లో ఉంటే ప్రాబ్లమ్. కానీ అతడు పక్కింట్లో ఉంటే ఫరవాలేదు కదా!ఇంతకు ముందులాగా అమ్మతో, మాతో ఎక్కడికైనా వద్దువుగాని. అతడు మన ఇంట్లో ఉండడు. ఏదైనా టూరుకు వెళ్ళాలంటే మనము మాత్రమే వెళ్ళటానికి ప్లాన్ చేసుకుందాము.సరేనా!"
మనవరాలిని అనునయిస్తూ చెప్పాడు శ్రీనివాసరావు.
ఆలోచిస్తూనే "సరే!"అంటూ తన అంగీకారాన్ని తెలిపింది పద్మిని.
సుజనకు కూడా మనసు రెండు రకాలుగా ఆలోచిస్తోంది. సంజయ్ నచ్చాడు కానీ తీరా ఈ పెళ్లి చేసుకుంటే పద్మిని మనసులో పెట్టేసుకొని తనకు దూరం అవుతుందేమోనని భయం ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది.
సుజన మళ్ళీ పద్మినితో మాట్లాడింది.
ఇంట్లో ఎటువంటి మార్పు రాదు. అంతకు ముందులాగానే అంతా ఉంటుంది. ఎటొచ్చి సంజయ్, మల్లిక పక్క ఇంట్లోకి వస్తారు. అంతే తేడా. ఈసారి పద్మిని కొద్దిగా ధైర్యంగానే ఒప్పుకుంది.
'తల్లి తన నుండి దూరం అవదు 'అనే ఆశ కొద్దిగా బలంగానే ఆమెలో విశ్వాసాన్ని నింపింది.
ఒక నెల రోజుల తర్వాత సంజయ్,సుజనల వివాహం జరిగింది. రిజిస్టర్ ఆఫీసులో దండలు మార్చుకోవటం మినహా పెద్ద కార్యక్రమాలేవీ లేవు.
సంజయ్, మల్లికలు ప్రక్క ఇంటిలోకి వచ్చారు. పద్మినికి పెద్ద మార్పేమీ గోచరించలేదు. అంతకు ముందులాగా తాతయ్య, అమ్మమ్మ, తల్లి కూడా పద్మినిని చూసుకుంటున్నారు. సంజయ్ మాటిమాటికీ శ్రీనివాసరావు ఇంటికి రాడు. వారంలో ఒకసారి వచ్చి కాసేపు కూర్చుని పద్మినితో చదువు గురించి, డిబేట్స్ గురించి మాట్లాడి పుస్తకాలు తెచ్చి ఇస్తున్నాడు. తల్లి అంతకు ముందులాగే తన పక్కనే పడుకుంటూ వుండటంతో అప్పుడే ఎదుగుతున్న పద్మినికి కాస్త సంతోషంగా ఉంది. తల్లి తనకు దూరమవదనే భావన ఆమెకు నిశ్చింతను కలుగచేసింది. మల్లిక హోమ్ వర్క్ చూసుకోవటం, పెద్దదానిలాగా మల్లికను చూసుకోవటం పద్మినిలో కాస్త బాధ్యతను తెచ్చిపెట్టింది.
రెండు నెలలు గడిచాయి.
పద్మినికి ఏయిత్ క్లాసు పరీక్షలు అయిపోయాయి.
ఇప్పుడు పద్మినిలో కొంచెం మార్పు వచ్చింది.
తల్లితో సంజయ్ అంకుల్ బయటికి వెళ్లినా పెద్ద పట్టించుకోవటం లేదు. తన పనిలో తాను ఉంటోంది. సంజయ్ అంకుల్ పరాయివాడు కాదు అన్న భావన మెల్లమెల్లగా ఆ పిల్ల మనసులో మొలకెత్తుతోంది.
ఎండాకాలం సెలవల్లో తల్లి, తాతయ్య, అమ్మమ్మలతో పాటు గోవా ట్రిప్పుకు వెళ్ళింది పద్మిని.
తనకు ఆఫీసులో పని ఉందని, గోవాకు రావటం కుదరదని తప్పించుకున్నాడు సంజయ్.
గోవాకు తను కూడా వస్తే పద్మిని ఎమన్నా అనుకుంటుందని భయపడ్డాడు.
'ఆ ట్రిప్పులో తమతోపాటు మల్లిక, సంజయ్ ఉంటే బాగుండు 'అని చాలా సార్లు అనుకుంది పద్మిని. గోవాలో చాలా మటుకు షాపింగ్ మల్లిక కోసం చేసింది. బొమ్మలు, గవ్వలు, బట్టలు,టోపీలు ఇలా.. చివరగా సంజయ్ కోసం ఒక షర్ట్ కొనింది పద్మిని.
గోవా నుండి వీళ్ళు రాగానే" అక్కా!"అంటూ పద్మినిని చుట్టుకొంది మల్లిక.
చిన్న పిల్లని ముద్దుపెట్టుకొని "ఈ సారి నువ్వూ మాతో వద్దువుగానీ! నీ కోసం నేను ఏం తెచ్చానో చూడు!"అంటూ బొమ్మలు చూపించింది పద్మిని.
"అంకుల్!ఇదిగో!మీకు గిఫ్ట్ తెచ్చాను "తను తెచ్చిన షర్ట్ సంజయ్ చేతిలో పెట్టింది పద్మిని. స్నేహంగా నవ్వాడు సంజయ్.
మెల్లమెల్లగా పద్మిని పరిస్థితులను అర్థం చేసుకుంటుందని శ్రీనివాసరావుకు నమ్మకం కలిగింది. అలా మోడుబారిన సుజన జీవితం మళ్ళీ చిగురించటం ప్రారంభమయిందని ఆ తండ్రి హృదయం ఆనందంతో ఉప్పొంగింది.
**