తీరిన సరదా
తీరిన సరదా
*
రంగాపురంలో ఉండే పూర్ణచంద్రరావు భూస్వామి. బాగా డబ్బున్నవాడు. చిన్నప్పటి నుండి సాంప్రదాయంగా పెరిగి, తండ్రి ఆస్తిపాస్తుల్ని, పేరు ప్రతిష్ఠల్ని చక్కగా కాపాడాడు. ఆయన భార్య శ్రీలక్ష్మి. భర్తకు తగ్గ ఇల్లాలు. పిల్లలు కూడా చక్కగా చదువుకొని ప్రయోజకులయ్యారు. అయితే ఈ మధ్య పూర్ణచంద్రరావుకు సరదా కోరికలు పుట్టుకొస్తున్నాయి. చిన్నప్పుడు కాలేజీలో బుద్దిగా చదువుకున్నాడు. ఆ తర్వాత తండ్రి చెప్పినట్లుగా శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.పిల్లల్ని పెంచాడు. ఈ మధ్య సెల్లుఫోను వచ్చాక ఒకటే అసంతృప్తి . ఇలా ఉండటమూ ఒక జీవితమేనా? జీవితంలో ఒక థ్రిల్లు ఉండాలి!..ఒక సరదా ఉండాలి!.. చెప్పుకోవటానికి ఒక సాహసం ఉండాలి!.. ఏమీ లేకుండా గానుగెద్దులాగా పుట్టాను.. పెరిగాను.. చచ్చాను అని ఉంటే ఏమిటి ప్రయోజనం? ఏదన్నా చేసితీరాలి!రాత్రికి రాత్రి హీరో అయిపోవాలి!.. అలా అయినవాళ్ళు చాలా మందే ఉన్నారు. ఏం చెయ్యాలి? ఏం చేస్తే బ్రహ్మాండమైన పేరొస్తుంది? అయితే ఏదన్నా నేర్చుకొని పెద్ద పేరు తెచ్చుకుందామంటే అవన్నీ సాధన చెయ్యటం ఈ వయసులో వల్లకానిపని. దానధర్మాలు చేసేసి అపర కర్ణుడిలాగా మారిపోదామన్నా భవిషత్తు పట్ల భయం..చేతిలో సెల్లుఫోను ఉంది. దానిలో పేసుబుక్కులూ, ఇంస్ట్రాగ్రాములు ఉన్నాయి. ఏదైనా క్రియేటివిటీగా వీడియోలు పెడితేనో!... లేదూ పాటలు పాడి పెడితేనో!.. అదీకాదూ ఇల్లు, పొలాలూ ఎలా ఉన్నాయో చూపిస్తేనో? ఎటూ ఇద్దమిద్ధంగా తేల్చుకోలేక పోతున్నాడు. తన భార్యను అడిగాడు. ఇంటిని, పనివాళ్ళని చూసుకుంటూ, ఊళ్ళో అమ్మలక్కలతో కబుర్లు చెబుతూ ఉండే శ్రీలక్ష్మికి భర్త కోరిక చిత్రంగా తోచింది.
"పోనీ గుడికి వెళ్లి కాసేపు కూర్చుని భజన చెయ్యండి!పుణ్యం పురుషార్థం!మనసుకు శాంతి.. అన్నీ ఉంటాయి!"అంది.
'ఇదో పిచ్చిమాలోకం!దీనిది పాతచింతకాయ పచ్చడి టేస్టు. అడగటం తనదే బుద్ధితక్కువ!'అనుకున్నాడు పూర్ణచంద్రరావు.
చక్కగా వీడియో తీసేవాడిని పిల్చుకొచ్చాడు. ఇల్లు మొత్తం వివరంగా వీడియో తీయించి 'పూర్ణచంద్రరావు బంగళా 'అని హెడ్డింగ్ పెట్టాడు. తనకెంత ఆస్తిపాస్తులున్నాయో చూపిస్తూ ఇల్లంతా తిప్పించి అందంగా వీడియో తీయించాడు. ఆరోజు చక్కగా పట్టుచీర కట్టుకొని నగలు పెట్టుకొమ్మని శ్రీలక్ష్మికి పురమాయించాడు. భర్తమాట వినే ఇల్లాలు కదా శ్రీలక్ష్మి వడ్డాణం, వంకీలతో సహా నగలన్నీ పెట్టుకొని తయారయింది. వీడియో బ్రహ్మాండంగా వచ్చింది. యు ట్యూబు లోనూ, పేసుబుక్కులోనూ పెట్టించాడు.అరగంటకొకసారి ఎన్ని వ్యూస్ వచ్చాయో అని, ఎన్ని లైకులు వచ్చాయో అని చూస్తూనే ఉన్నాడు. బంధువులకు మిత్రులకు ఫోన్లు చేసి చెప్పాడు.
పిల్లలు మాత్రం "ఎందుకు నాన్నా!ఇదంతా!" అంటూ విసుక్కున్నారు.
అప్పటికి నెలరోజులయింది. బోలెడు వ్యూస్ వచ్చాయి. చాలా మంది లైకులు కొట్టారు. కొంతమంది"ఆహా!పల్లెటూరు!సాంప్రదాయాలకు, ఆప్యాయతకు పుట్టినిల్లు!"అంటూ కామెంట్లు పెట్టారు. పూర్ణచంద్రరావుకు ఆనందం వేసింది. మరో వీడియో ఊరి దేవాలయం మీద తీద్దామనుకున్నాడు.
ఆ రోజు సాయంత్రం పనివాళ్లు ఇంటికి వెళ్లిపోయారు. వంటావిడ కూడా వెళ్లిపోయింది. శ్రీలక్ష్మి టి. వి. లో ఏదో ఆధ్యాత్మిక ప్రవచనం వింటోంది. సెల్లుఫోనులో మునిగి ఉన్నాడు పూర్ణచంద్రరావు. అదుగో అప్పుడే వచ్చారు ఓ నలుగురు యువకులు.
"సార్!మీరు తీసిన వీడియో చూసి వచ్చాము!మీ లాంటి గొప్పవాళ్ళని ఇంటర్వ్యూ చెయ్యాలని మా కోరిక!"చెప్పారు వాళ్ళు.
ఉబ్బితబ్బిబ్బయ్యాడు పూర్ణచంద్రరావు.
శ్రీలక్ష్మి కూడా లేచి వచ్చింది. అందరికీ షర్భత్ కలిపి ఇచ్చి, తినటానికి ఇంట్లో ఉన్న కజ్జికాయలు, చక్రాలు పెట్టింది.
"బాగున్నాయి!బాగున్నాయి!ఆంటీ చేతి ప్రసాదం అమృతంతో సమానం!"అంటూ అన్నీ తిని తేన్చారు.
సంతోషించింది శ్రీలక్ష్మి.
అంతే!.. ఒకడు వీధి తలుపు గడియ పెట్టాడు. మరో ఇద్దరు పూర్ణచంద్రరావును, శ్రీలక్ష్మిని తాళ్ళతో కట్టేశారు.
మరొకడు కాపలాగా ఉన్నాడు. హాయిగా, దర్జాగా ఇల్లంతా కలియతిరుగుతూ నగలు, డబ్బు, వెండి సామానుతో పాటు దంపతులకున్న విలువైన బట్టలు కూడా సర్దేశారు దొంగలు.
గుడ్లప్పగించి చూస్తూ ఉన్నారు పెద్దవాళ్లిద్దరూ. ఒక గంట తర్వాత దొంగ వెధవలు నలుగురూ వీధి తలుపు దగ్గరికి వేసి వెళ్లిపోయారు. రాత్రికి పడుకోవటానికి వచ్చిన పాలేరు వెంకట్ వీళ్ళని చూసి కేకలు పెట్టి, కట్లు విప్పాడు. అంతా గోల గోల. పరామర్శించే వాళ్ళు కొందరు.. విమర్శించే వాళ్ళు కొందరు... పిల్లలకు కబురు వెళ్ళింది.
తెల్లవారికి పిల్లలు వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జరిగిందంతా తెలుసుకున్నాడు ఇన్స్పెక్టర్ రవి.
"అంకుల్!ఈ మధ్య తోచీతోచకుండా చాలామంది ఇలా హోమ్ టూర్లు అని వీడియోలు పెట్టటం ఎక్కువయింది. దాంతో ఇలాటి దొంగతనాలు ఎక్కువయ్యాయి. చక్కగా మనమిచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే దొంగలు హాయిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు.
మేము వెదికి పట్టుకోవటానికి ప్రయత్నిస్తాము!ఇంకోసారి ఇలా వెఱ్ఱి మొఱ్ఱి వీడియోలు సరదా కోసమో, పేరు కోసమో పెట్టకండి!"
ఇన్స్పెక్టర్ చెప్పింది విని సిగ్గుతో తలవంచుకున్నాడు పూర్ణచంద్రరావు.
శ్రీలక్ష్మి ఇంకా లబోదిబో మని మొత్తుకుంటూనే ఉంది.
విశేషం ఏమిటంటే పూర్ణచంద్రరావు వీడియో ఉదంతం అంతా న్యూస్ ఛానళ్ల వాళ్ళు రెండు రోజులు తెగ చూపించి పండగ చేశారు. ఏదైతేనేం పూర్ణచంద్రరావు పేరు పేపర్లలోకి, టి. వి. ఛానళ్లలోకి ఎక్కింది.
మొత్తానికి అతడి కోరిక తీరిందిగా!!!!
(సమాప్తం)
