kottapalli udayababu

Action Classics Inspirational

4  

kottapalli udayababu

Action Classics Inspirational

ఈ మార్పు కోసమే!

ఈ మార్పు కోసమే!

8 mins
2.1K


ఈ మార్పు కోసమే (కథ)


ఆ సమస్య ఎలా చెబితే తనకు అర్థం అవుతుందా అని ఆలోచిస్తున్న నేను హఠాత్తుగా గుర్తుకు వచ్చినట్లు పావనిని అడిగాను.

"ఫస్ట్ యూనిట్ మార్కులు ఇచ్చారామ్మా?" పావని మాట్లాడలేదు. తలదించుకుంది.

" చెప్పమ్మా. మార్కులు ఇచ్చారా లేదా?" రెండవసారి అడిగాను.

నా కంఠంలో వద్దనుకున్నా ప్రతిధ్వనించిన తీవ్రతకి భయపడింది కాబోలు - పావని ఏడవడం మొదలు పెట్టింది.

ఐదు నిమిషాలు వెక్కుతూనే ఉంది. అంతసేపు నేను మౌనంగానే కూర్చున్నాను.

''చూడు. నేను నిన్ను ఏమీ తిట్టకుండా కొట్టకుండా నువ్వు ఇలా ఏడవడం ఏమైనా బాగుందా? తప్పు కదూ? చెప్పు .పర్వాలేదు. ఎన్ని మార్కులు వచ్చాయి?"

"పదకొండున్నర సార్" అని చెప్పింది.

" మీ డాడీ ఏమన్నారు?"

"తి...తి...తిట్టారు సార్."

"పోనీలే . మా నువ్వు ట్యూషన్ లో చేరి నెల కూడా కాలేదు. 25 కి 23 మార్కులు వచ్చేలా శిక్షణ ఇస్తాను అన్నాను... కానీ పదకొండున్నరే వచ్చాయి. ఈసారి ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి "అన్నాను ఓదార్పుగా.

" డాడీ తిట్టింది నన్ను కాదు... సార్."భయంగా చూస్తూ అంది పావని.

"మరి?" అయోమయంగా అడిగాను.

"మిమ్మల్ని తిట్టారు సార్" పావని ఒక్కసారిగా మళ్లీ ఏడవసాగింది.

నేను గతుక్కుమన్నాను.

" ఏమని తిట్టారు? అయినా తిట్టినది నన్ను అయితే నువ్వు ఏడవడం దేనికి? ఇందులో నా తప్పేమైనా ఉంటే సరిదిద్దు కుంటాను." అన్నాను .

పావని తల అడ్డంగా ఊపింది .

"లేదు సార్ ... మీరు చెప్పినట్లు స్టెప్పులు అన్ని కరెక్ట్ గా వేసి మరీ చేశాను సర్. 'నువ్వేమైనా ముసలమ్మవా... ఇలా చాదస్తంగా చేసి నా ప్రాణాలు తీస్తావేంటి? ముచ్చటగా మూడు స్టెప్పులు వేసి ఆన్సర్ వచ్చేలా నేను చెప్పాను కదా! ఏ తల మాసిన వెధవ చెప్పాడు నీకు ఇలా చేయమని?' అని మా టీచర్ అన్ని లెక్కలు కొట్టేసింది సార్ '. తాను చెప్పినట్లు లెక్కలు చెయ్యడం లేదు అని డాడీకి కంప్లైంట్ రాసింది సర్ డైరీలో"అంది పావని.

వెంటనే నేను నవ్వుకున్నాను. ఒక టీచర్ కు మరో టీచర్ అంటే ఉన్న ఈగో అది. నన్ను అన్నందుకు బాధ లేదు కానీ ఒక బాధ్యతాయుతమైన తండ్రి తన కూతురికి మార్కులు రాలేదని నన్ను తిట్టడం నాకు చివుక్కు మనిపించింది .

"ఇంతకీ మీ డాడీ ఏమన్నారు?" అడిగాను.

" నెలకి 300 ఫీజు తీసుకున్నాడు. అంటే రోజుకు పది రూపాయలు అయింది. 25 కి పదకొండున్నర మార్కులు వచ్చేలా చెప్పాడంటే ...వాడేం లెక్కల మాష్టరు? వెంటనే ప్రైవేట్ మానెయ్యి" అన్నారు

'మీకు చెప్పడానికి ఖాళీ సమయం ఉండదు కదా.దాన్ని అక్కడికే వెళ్లి రానివ్వండి' అంది మమ్మీ.'' అని చెప్పింది పావని .

ఆమె నోటితో కాదు ఆ మాటలు చెబుతున్నది... నిష్కల్మషమైన మనసుతో.

" మీ నాన్నగారు ఏం ఉద్యోగం చేస్తారు?"

" బ్యాంకులో క్లర్క్ సార్. మా మమ్మీ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ సార్ .అయినా మా మమ్మీ కి ఈ లెక్కలు రావు సార్."

"మీ డాడీ కి ఎన్నింటికి ఆఫీస్ అయిపోతుంది?"

" సాయంత్రం ఆరింటికి ఇంటికి వస్తారు సార్. స్నానం చేసిన తర్వాత పేపర్ చదువుతారు. నన్ను హోం-వర్కు చేసుకోమని తమ్ముడిని మమ్మీని తీసుకొని ఒక గంట బయట తిరిగి వస్తారు సార్. వచ్చిన తర్వాత భోజనం చేసి టీవీ చూస్తాను సార్ .ఎప్పటి వరకు చూస్తారో తెలియదు సార్. నాకు నిద్ర వచ్చి పడుకుంటాను."

"మరి నిన్ను బయటకు తీసుకు వెళ్లరా?'

" స్కూల్ వర్క్ ఎక్కువగా ఉన్నా ,పరీక్షల రోజులైనా తీసుకు వెళ్లరు సార్. లేదంటే తీసుకెళ్తారు."

"సరే .నేను చెబుతున్న లెక్కలన్నీ నీకు బాగా అర్థం అవుతున్నాయా?"అడిగాను.

" చాలా బాగా అర్థం అవుతున్నాయి సార్.

"నిజంగా?"

"నిజంగా సార్ .మీరు సందేహం వస్తే అడగమంటారు. ఎన్నిసార్లు అడిగినా ఓపికగా, విసుక్కోకుండా సమాధానం చెబుతారు. మా టీచర్ అలా కాదు సార్. పేద్ద క్లాస్ ఫస్ట్ బయల్దేరావు. కూచో" అని ఎప్పుడూ కసురుకుంటుంది సార్. "

ఆ తర్వాత నేను పావనిని పావు గంట పైనే వివిధ ప్రశ్నలు వేసి నాకు కావలసిన సమాధానాలు రాబట్టు కున్నాను.

అంతా విన్నాక అన్నాను

"అమ్మా.. పావని రేపట్నుంచి నువ్వు ట్యూషన్ కి రాకమ్మా" అన్నాను.

ఆ లేత మనసు గాయపడినట్టు గా చూసింది.

" అవునమ్మా! నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కదా . వారం రోజులు ఏలూరులో శిక్షణా కార్యక్రమానికి డ్యూటీ వేశారు. ఉదయం ఎనిమిది గంటలకల్లా వెళ్ళిపోవాలి .రాత్రి ఇంటికి వచ్చేసరికి 10 గంటలు అవుతుంది మళ్ళీ. నేను ఊరు నుంచి వచ్చాక వద్దు గానీ .ఈ విషయం మీ నాన్నగారికి చెప్పు "అన్నాను.

" అలాగే సార్."

" అసలు ...నీకు ఇక్కడికి రావాలని,సబ్జెక్టు నేర్చుకోవాలని ఉందా?"

" స్కూల్ మానేసి ఇక్కడే నేర్చుకోవాలని ఉంది సార్ "అంది పావని.

ఒక సమస్యను వివరంగా చెప్పి అలాంటిదే మరొకటి చేయమని ఆలోచనలో పడ్డాను.

*******

సుమారు 20 రోజుల క్రిందట ఒక ఆత్మీయుడు సజెస్ట్ చేయడంతో పావనిని తీసుకుని ఆమె తండ్రి నా దగ్గరికి వచ్చాడు. ట్యూషన్ చెప్పమని కోరాడు. నేను విముఖత ప్రదర్శించాను.

ఆయన బ్రతిమిలాడాడు. నా ఆత్మీయుని పేరు పదే పదే ప్రస్తావించడంతో అంగీకరించాను. ఫీజు ఎక్కువ చెబితే మానేస్తాడు 300 చెప్పాను. వెంటనే డబ్బు నా చేతిలో పెట్టాడు. అతని టెక్నిక్ నాకు అర్థమైంది.

ఏ మాత్రం ఖాళీగా దొరికినా ఏ సామాజిక సమస్యకు ఏ పరిష్కారమార్గం సూచిస్తే బాగుంటుందా అని ఆలోచించి కథగా మలిచే కథా రచయిత ను, సాహిత్య అభిమాని నేను .

ప్రవృత్తి కన్నా నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఎనలేని గౌరవం. ఎందుకంటే మా నోట్లోకి నాలుగు వేళ్ళు వెడుతున్నాయంటే ఆ పిల్లలే కారణం. వారే లేకుంటే మేము చెప్పే చదువు నిరర్ధకం.

తెల్లకాగితాలు లాంటి మల్లెపూల మనసులతో విద్యార్థులు తరగతి గది లో నేర్చుకోవాలి అన్న తపనతో అడుగు పెడతారు . నేర్చుకున్న దానిని జీవితాంతం ప్రతి విద్యార్థి మనసులో ముద్రించుకునేలా బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయునిది. ఒక మౌలిక భావన విద్యార్థికి అర్ధమయ్యేలా బోధించామా లేదా అన్నది ఉపాధ్యాయునికి వెంటనే అర్థమైపోతుంది. అలా చెప్పగలిగినప్పుడు ప్రతి వాక్యము స్ఫూటంగా,క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్పగలిగాను అన్న సంతృప్తి కలుగుతుంది. చదువు పరంగా మనం నేర్చుకున్న ప్రతీవిషయాన్ని తర్వాతి తరానికి పరిపూర్ణంగా అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుగా మామీద ఎంతైనా ఉంది. ఆ సంతృప్తి కలిగే అంతవరకూ నేను బోధిస్తూనే ఉంటాను.

అందుకే అందరికీ నా భోధన చాదస్తంగా అనిపిస్తుంది .

అయితే నా బాధ ఒక్కటే.

మా ఉపాధ్యాయుల నుండి మేము నేర్చుకున్నదే కొంత . ఆ కొంతలో నాకు తెలిసినది అంతా పిల్లలకు వివరించి చెప్పే టందుకు ప్రయత్నిస్తాను. ఇంకా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో గణితంలో వస్తున్నా లేటెస్ట్ అప్డేట్ విజ్ఞానాన్ని తెలుసుకుని మరీ వారికి బోధిస్తాను. అలా బోధించడం నాకెంతో ఇష్టం.

అయితే మేము నేర్చుతున్న దానిలో ఆడుతూ పాడుతూ కొంతే నేర్చుకుని బ్రతుకుతెరువు కోసం ఉపాధ్యాయులు గా మారుతున్న యువత, తమ తర్వాత తరానికి అందించే విషయ పరిజ్ఞానం ఎంత? పోటీతత్వం ప్రబలిపోతున్న ఈ రోజుల్లో విద్యార్థి ఎంత వరకు ఉపాధ్యాయుడు చెప్పినవన్నీ వేగంగా నేర్చుకో గలుగుతాడు? అన్న ప్రశ్న నన్ను తొలిచి వేస్తూ ఉంటుంది.

అందుకే పావని నా దగ్గర ఒకే ఒక ట్యూషన్ విద్యార్థి అయినా ఆమె ఒక్క దాని కోసం నా గంటన్నర సమయం వెచ్చించాలా అని ముందుగా ప్రశ్నించుకున్నాను. కానీ ఈ మాస్టారి వద్ద మౌలిక భావనలు పరిపూర్ణంగా నేర్చుకో గలిగాను అనుకునే ఆమె అందమైన భావనకు రూపం ఇవ్వడం కోసం అంగీకరించాను .

"సార్ ఇక్కడ ఈ డౌట్ చెప్పరా?" అని చెప్పించుకుని ఆ సమస్య పూర్తిచేసి పావని వెళ్ళిపోయింది. మా శ్రీమతి లోపల నుంచి అంతా విన్నది కాబోలు.

" ముష్టి 300 కోసం ఏమిటో మీరు... మీ చాదస్తం. ఎవరైనా చెబితే వినరు.మీకు తోచదు... అసలు వాడెవ్వడు మిమ్మల్ని మాటలు అనేటందుకు? ఇంటికి వెళ్లి నాలుగు దులిపేసి రండి" అంది.

ఇది ప్రతి ఇంటి భగవద్గీత. అందులో నా భార్య ఇప్పుడు చూపించినది విశ్వరూప దర్శనం. భర్తనైన నాది సవ్యసాచి అర్జునుడి స్థానం... అని నా అభిప్రాయం.

నవ్వుకుంటూ లేచి నా పనిలో పడ్డాను.

*******

ఆ సాయంత్రమే పావని తో వాళ్ళ నాన్న మా ఇంటికి వచ్చాడు.

" నమస్తే... రండి... రండి!"అన్నాను కుర్చీ చూపిస్తూ.

అతను కూర్చోకుండా నిలబడి నడుము రెండు చేతులు పెట్టుకుని గంటు పెట్టుకున్న ముఖంతో నన్ను ప్రశ్నించాడు.

" ఏమిటి? మా అమ్మాయిని ప్రయివేటుకు రావద్దన్నారట..."

" ఏమిటి నన్ను నానా మాటలు తిట్టారుట." అంటాను అనుకున్నాడు కాబోలు...

ఎందుకో అతన్ని ఎడ్యుకేట్ చేయడం అవసరం అనిపించింది నాకు.

" పావని ఒకతి ఇంటికి వెళ్ళిపోగలదా సార్?" అడిగాను.

" వెళ్ళగలదు. ఏం?"

" మన పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు తను ఇక్కడ అనవసరం. దయచేసి ఆ అమ్మాయిని ఇంటికి పంపియండి" అన్నాను వినమ్రంగా.

అతను ఏమనుకున్నాడో "నువ్వు ఇంటికి పో .నేను మాట్లాడి వస్తాను" అన్నాడు కూతురుతో .

అప్పుడు పరిశీలించాను. పావని బాగా ఏడ్చి వచ్చినట్టుంది .నా కేసి, వాళ్ళ డాడీ కేసి మార్చి మార్చి చూసి వెళ్ళిపోయింది.

"కూర్చోండి " మళ్ళీ చెప్పాను.

" అయినా ఫీజు తీసేసుకుని పిల్లను ప్రైవేటుకు రావద్దు అనడమేనా సంస్కారం?" వెటకారంగా అని కూర్చున్నాడు.

అతనికి అతన్ని కూర్చోమనడం నా తప్పు అని ఫీలయ్యాను. అయినా తప్పదు. అతనొక మూర్ఖత్వం లో ఉన్నాడు. ముందు దానిని వదిలించాలి.

" మీరు ఏం చదివారు?" అడిగాను.

" బి .ఎస్ .సి."

" పూర్తి చేశారా?"

" వాట్ ఏ నాన్సెన్స్ క్వశ్చన్ ? పాస్ అవకుండా బ్యాంకు జాబ్ ఇస్తారా? ఫస్ట్ క్లాస్ !"అన్నాడు గర్వంగా.

" గ్రూప్ ?"

"ఎంపీసీ"

" అంటే మీరు సామాన్యమైన వ్యక్తి కాదన్నమాట .ఫస్ట్ క్లాస్ కు చెందిన వ్యక్తి అన్నమాట" అన్నాను నిదానంగా ద్వంద్వార్థం గా.

" ఎస్ . నేను ఎక్కడికి వెళ్లినా ఫస్ట్ క్లాస్ లో నే వెళ్తాను. ఎక్కడ ఉన్నా ఫస్ట్ క్లాస్ గానే వ్యవహరిస్తాను . వ్యవహరిస్తాం అందుకే మీరానాడు అడగకపోయినా ఫీజు ఇచ్చేసాను..." ముష్టి పారేశాను అన్నంత తేలికగా చెప్పాడు.

" అలాగా. కానీ మీరు నా దృష్టిలో ఎల్కేజీ కి కూడా అర్హులు కారు" అన్నాను సూటిగా చూస్తూ .

వాట్ ఏంటి మీరంటున్నది?"

"అవును. ఫస్ట్ క్లాస్ చదువు చదివిన మీకు కనీస సంస్కారం లేకపోవడం మీ దౌర్భాగ్యం. ఫస్ట్ క్లాస్ సబ్జెక్ట్ చదివే కుర్రాడికి కూడా ఎదుటి వ్యక్తితో , అదీ తన అవసరం ఉండి వచ్చిన వ్యక్తి తో ఎలా మాట్లాడాలో తెలుస్తోంది. తెలుసుకుంటున్నారు .అందుకే మీరు ఎల్కేజీ కి కూడా అనర్హులు అంటున్నాను."

"మీరు నన్ను అవమానిస్తున్నారు."

" మీరు నన్ను అవమానించిన దానికన్నానా? చూడండి .మీరెవరో నాకు తెలియదు .నా ఆత్మీయుడు మిమ్మల్ని నా దగ్గరకు పంపాడు. అతను నిజంగా మీకు ఆత్మీయుడు. ఎందుకంటే మీ అమ్మాయి బిలో యావరేజ్ స్టూడెంట్. అటువంటి అమ్మాయికి పదిమంది నేర్చుకునే చోట అయితే అర్థం కాదని, అర్థం చేసుకోలేదు అని అర్ధం చేసుకుని నా పేరు సజెస్ట్ చేశాడు. మీరు ఎవరో తెలియకపోయినా అతను నాకు ఆత్మీయుడు కాబట్టి అంగీకరించాను. మీ అహంకారాన్ని వెంటనే ఫీజు రూపంలో నా ముందు పెట్టారు. మీ అమ్మాయి చదువు గురించి నాతో బేరాలు ఆడారు. మీ అమ్మాయికి మౌలిక భావనలు అర్థం కావడం లేదని, క్రింద తరగతుల మౌలిక భావనలను కూడా బోధించమని కోరారు. నేను ఆ విధంగానే మీ అమ్మాయికి చదువు చెప్పాను. ముందు నేను ఇక్కడ పెట్టిన పరీక్షలో మీ అమ్మాయికి 21 మార్కులు వచ్చాయి. కానీ పాఠశాలలో పదకొండున్నర వచ్చాయి. అందుకు మీరు 'వాడికేం వచ్చు... ఫీజు తీసేసుకుని సరిగ్గా చదువు చెప్పడా?' అని నన్ను నిందించడం ఎంత వరకు న్యాయం? ఇదిగో మీ అమ్మాయి ఫీజుగా మీరు నాకు ఇచ్చిన 300. మరో 300 ఎక్కువ వేసి 600 ఇస్తున్నాను." అని బల్ల మీద ఉన్న పర్సులో నుంచి 600 తీసి అందించాను.

" ముందు ఈ డబ్బు తీసుకోండి"

అతను ఖంగుతున్నాడు.

" ఎందుకు? వద్దు... వద్దు..." అన్నాడు

"ముందు పట్టుకోండి సార్" బలవంతంగా అతని పిడికిలిలో ఉంచి పిడికిలి మూసి అన్నాను.

" ఇప్పుడు చెప్పండి. నన్ను తిట్టిన తిట్లు మీరు వెనక్కి తీసుకోగలరా?"

" అసలు మిమ్మల్ని నేను తిట్టాను అని ఎవరు చెప్పారు .మా పావనే చెప్పి ఉంటుంది. నరికేస్తా దాన్ని" అతను ఆవేశంగా అరిచిన అరుపుకు గది నాలుగు గోడలు ప్రతిధ్వనించాయి.

" ఇది మీ ఇల్లు కాదు. మీకు సంస్కారం లేదు అన్నది అందుకే. డబ్బు మొహాన పడేసాం కాబట్టి మీ అమ్మాయికి ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలి అనుకోవడం మీ అత్యాశ. ఉపాధ్యాయుడు పట్ల మీకు గల చులకన భావానికి పరాకాష్ఠ. బీఎస్సీ ఎంపీసీ చదివి కూడా ఏడో తరగతి లెక్కలు మీ కన్న కూతురికి అర్థం అయ్యేలా చెప్పుకోలేని మీ చేతగానితనం. దానికి సమయం లేదు అని పేరు పెట్టుకుని ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చాక మీ అమ్మాయి చదువు పట్టించుకోకుండా, బజార్లు తిరిగి తిరిగి ఎంజాయ్ చేయడం మీ బాధ్యత లేని జీవితానికి నిదర్శనం.

అటు కాన్వెంట్ లోను, ఇటు ట్యూషన్ లోనూ వేలకి వేలు డబ్బులు కట్టామన్న ఆలోచనే తప్ప ఆ డబ్బు కి ఎక్కడ ఎంతవరకు న్యాయం జరుగుతుందో తెలుసుకోలేకపోవడం మీ మూర్ఖత్వం. అన్నిటికంటే ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎవరో చెబితే లేదా పర్యవేక్షణ ఉంటేనే చదువు చెబుతాడు అని అనుకోవడం మీ అమాయకత్వం.

మీరే కాదు. ఈనాటి సమాజంలో ఉపాధ్యాయులు అంటే సాటి ఉద్యోగిగా తోటి ఉద్యోగులకే ఒక చులకనభావం.అక్షరం ముక్క రాని ప్రతీవాడు వేదికలెక్కి 'విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే' అని ఉపన్యాసాలు ఇవ్వడం పరిపాటి అయిపోయింది. నేను చెప్పేది ఒక్కటే.

దయచేసి ఉపాధ్యాయుల్ని నిందించకండి. వారిలో నిద్రాణమై దాగిఉన్న బోధనాపటిమను వెలికి తీసి, అది విద్యార్థులలో ప్రతిబింబించేలా సలహాలు సూచనలు ఇవ్వండి .

దయచేసి మీ అమ్మాయి మనసులో ఉపాధ్యాయుల పట్ల విషబీజాలు నాటకండి. మీ అమ్మాయిని నా దగ్గర కాకపోతే మరొక చోట చదివించుకోండి. ఇంక మీరు వెళ్ళవచ్చు" అన్నాను.

అంతవరకు నేను ఎంత ఆవేశంగా మాట్లాడానో రెండు నిమిషాల తర్వాత ఆయాసం తీరాక గానీ నాకు అర్థం కాలేదు.

అతను తలవంచుకొని "ఐ యాం సారీ సార్"అని డబ్బు ఇవ్వబోయాడు.

నేను మొహం తిప్పుకున్నాను చిరాకుగా. అతను డబ్బు తో వెళ్ళిపోయాడు.

*********౧

మూడు రోజుల తర్వాత అతని నుంచి నాకు ఒక ఉత్తరం అందింది.

చించి మడతలు విప్పే సరికి అందులోంచి 6 వంద నోట్లు బయటపడ్డాయి . అందులో ఇలా ఉంది.

"పూజ్యులైన ప్రభాకర్ మాస్టారికి,

పావని తండ్రి నమస్కారాలు. నా సంస్కారహీనతకు సిగ్గు పడుతున్నాను. నేనెవరో తెలియకపోయినా మీరు నా పట్ల ప్రవర్తించిన తీరు, చూపిన ఈ ఔదార్యం, నా కుమార్తె పట్ల మీరు చూపిన అంకితభావం మా అమ్మాయి నోట్స్ చూస్తే నాకు అర్థమైంది. మిమ్మల్ని క్షమాపణ అడిగేటందుకు కూడా నాకు అర్హత లేదు.

ఆరోజు మీ స్థానం లో నేను నుండి, నా స్థానంలో మీరుంటే, తలుపు మూసి లాగి లెంపకాయ కొట్టాక అపుడు ఏదైనా మాట్లాడే వాడిని. ఓ తండ్రిగా నేను చేపట్టాల్సిన బాధ్యతని గుర్తించేలా చేశారు. మీరు ...మీరు ఆశించే మార్పుకు ఇది నాంది కావాలని... అందుకోసమేనా మీరు ఈ సంఘటనకి కథారూపం కల్పించాలని కోరుతున్నాను. పావని కి మిమ్మల్ని ద్రోణాచార్యుని చేసి, నేను ఏకలవ్యుడనై, మీ దగ్గరికి తీసుకు వస్తాను. సెలవు.

క్షమాపణలతో-

పావని తండ్రి.

*********

మూడేళ్ల తర్వాత-

ఎస్.ఎస్.సి. స్టేట్ ర్యాంకుల్లో పావనికి ఐదో రాంక్ అని నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది.

ఆ సాయంత్రం పావని తో ఆమె తండ్రి నా దగ్గరికి వచ్చాడు .

నేను సంతృప్తి నిండిన కళ్ళతో ఆయన కౌగిలించుకుని అభినందించాను.

" కంగ్రాట్స్ సర్. హార్ట్-ఫుల్ కంగ్రాట్స్. మీరు సాధించారు"అన్నాను సంతోషాతిరేకంతో.

పావని నాకు పాదాభివందనం చేసి ఒక పెద్ద ప్యాకెట్ అందించింది.దాని నిండా పళ్ళు, కొత్త బట్టలు.

"మీదగ్గరనుంచి తీసుకుపోయాకా,సబ్జెక్ట్లు అన్ని నేను రివైజ్ చేసుకుని మా అమ్మాయికి నేనే శిక్షణ ఇచ్చాను సర్. కానీ ప్రతీక్షణం మీరు చెప్పిన విధానాన్ని అనుసరించి బోధించాను. నా కూతురు ఈ విజయానికి స్ఫూర్తి మీరే మాస్టారు.వెళ్ళొస్తాం సార్ "వాళ్ళు వెళ్ళిపోయారు.

ఆ రాత్రి ప్రశాంతంగా కూర్చుని "ఈ బీజం ఎంతమంది విద్యార్థుల తల్లిదండ్రులను మారుస్తుందో చూడాలి మరి "అనుకుంటూ "ఈ మార్పు కోసమే" అన్న మకుటంతో కథ రాయడం ప్రారంభించాను.

సమాప్తం



Rate this content
Log in

Similar telugu story from Action