యుద్ధ నౌకలు
యుద్ధ నౌకలు
పొంగుతుందా అన్నట్లు
గంగ ప్రవహిస్తోంది
నౌకలవిగో అంటూ
తీరంలోని ప్రజలు గుర్తించారు
చెల్లా చెదురుగా
యుద్ధం నుంచి వస్తూ
తీరాన్ని తాకాలని
ఉబలాటపడిపోతున్నాయి
తెరచాపల మీద
విజయ పతాకాల గుర్తులు
వీరుల కరవాలాల నుండి
వస్తున్న రక్తపు వాసన
పుష్పాలతో
దీప మాలికలతో
వివిధ మంగళ వాద్యాలతో
స్వాగతం పలికే తీరం
యుద్ధ నౌకల సముదాయం
తీరాన్ని చేరింది
ఆశ్చర్యంగా
పడవలు ఖాళీగా ఉన్నాయి
ఆయుధాలు మాత్రమే వచ్చాయి
తమ వారి కోసం
ఎదురు చూసే కళ్ళు కన్నీళ్లను పిలిచాయి
