ఉత్తమం
ఉత్తమం
నిదురగదికి తలుపువేసి..చూస్తుండుట ఉత్తమం..!
ఎఱుకపూల వనముగమది..పెంచుకొనుట ఉత్తమం..!
ప్రేమలేఖ ఇవ్వాలను..ముచ్చటయే చిత్రమోయ్..
మనసు పడే సంగతికే..సెలవిచ్చుట ఉత్తమం..!
హృదయమెంత విశాలమో..ఏ కోకిల చాటునోయ్..
విశ్వమైత్రి గగనమదే..కాపాడుట ఉత్తమం..!
నిరుపమాన త్యాగనిధే..జన్మనిడిన అమ్మరో..
మాతృపాద సేవనమున..మదినిలుపుట ఉత్తమం..!
నిజకార్మిక నేతంటే..నాన్నగాక ఎవ్వరోయ్..
నాన్నగుండె కంటిచెమ్మ..గుర్తించుట ఉత్తమం..!
ఎంతపెద్ద చదువుచదివి..ఉద్ధరింతు వెవరినోయ్..
కన్నవారి కనురెప్పగ..కదలాడుట ఉత్తమం..!

